RTC Driver Shankar Goud : శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..!
RTC Driver Shankar Goud : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తరలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు.
RTC Driver shankar goud death minister ponnam prabhakar and brs harish rao comments
RTC Driver Shankar Goud : టీజీఎస్ఆర్టీసీ సమ్మెలో భాగంగా పెట్రోల్ పోసుకుని.. ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట మండలం ముత్తోజిపేటకు తరలించారు. శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ముత్తోజిపేటకు తరలించడంతో ఆర్టీసీ కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ముత్తోజిపేటలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు జరుపుతుందని మంత్రి పేర్కొన్నారు.
రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం
ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. “ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన విమర్శించారు.
నర్సంపేటలో ఉద్రిక్తత
నర్సంపేట శివారు ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ మృతదేహం వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా మృతదేహాన్ని నర్సంపేట పట్టణంలోకి రానీయకుండా శివారు ప్రాంతం నుంచి తరలిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ భౌతికకాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లాలని తోటి కార్మికులు డిమాండ్ చేశారు. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ శాంతించాలంటే డిపోకు తీసుకెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమ ఆవేదన వినాలంటూ కార్మికులు చేతులు జోడించి పోలీసులను వేడుకున్నారు. పోలీసులు కార్మికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
హరీశ్ రావు సంతాపం
“ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం మా హృదయాలను తీవ్రంగా కలిచివేసింది. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు మా ఘన నివాళులు” అంటూ హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
అంత్యక్రియల్లో పాల్గొననున్న నేతలు
శంకర్ గౌడ్ అంతిమ సంస్కారాలలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొననున్నారు.
