BRS Yuva Sangrama Sabha : బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు.. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. కానీ, షరతులు వర్తిస్తాయ్..
BRS Yuva Sangrama Sabha : . బీఆర్‌ఎస్ అనుబంధ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శనివారం (జూలై 18) నిర్వహించనున్న ‘యువ సంగ్రామ సదస్సు’కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
- Harish Thanniru
- Updated on- July 17, 2026 / 04:46 PM IST
Telangana High Court grants permission for BRS 'Yuva Sangrama Sabha' at Saroornagar Stadium
- బీఆర్ఎస్ పార్టీకి ఊరట
- యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి
- నేడు సరూర్‌నగర్ స్టేడియంలో సదస్సు
BRS Yuva Sangrama Sabha : తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీఆర్‌ఎస్ అనుబంధ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శనివారం (జూలై 18) నిర్వహించనున్న ‘యువ సంగ్రామ సదస్సు’కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. కొన్ని షరతులతో సభ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సభ నిర్వహణ కోసం బీఆర్‌ఎస్ నేతలు జూన్ 30నే పోలీసులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్ నివేదికలను కారణంగా చూపుతూ పోలీసులు చివరి నిమిషంలో అనుమతిని నిరాకరించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే సభను అడ్డుకుంటోందని ఆరోపించిన బీఆర్‌ఎస్ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కొన్ని షరతులతో సభ నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేసింది. శాంతియుతంగా సభ నిర్వహించుకోవాలని కోర్టు ఆదేశించింది. రహదారుల దిగ్భంధం, రెచ్చగొట్టే విధానం ఉండొద్దని పేర్కొంది.
ఈ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌లోని హామీల అమలుపై ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ముఖ్యంగా మెగా డీఎస్సీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది.
ప్రత్యేకంగా, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇదే సరూర్‌నగర్ స్టేడియంలో ప్రియాంకా గాంధీ సమక్షంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే వేదికపై కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే కార్యాచరణను ప్రకటించాలని బీఆర్‌ఎస్ వ్యూహం రచించింది. ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. హైకోర్టు అనుమతితో ఈ సభకు రాజకీయ ప్రాధాన్యం మరింత పెరిగింది.
