Telangana Inter Board: ఇంటర్ విలీనమైనా సిలబస్ మారదు.. ప్రస్తుత స్టూడెంట్లకు పాత సిలబసే.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన!
తెలంగాణలో ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసినప్పటికీ ప్రస్తుత విద్యార్థుల సిలబస్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఇంటర్ బోర్డు (Telangana Inter Board)స్పష్టం చేసింది.
- V Santhosh Kumar
- Published on- November 17, 2026 / 08:14 AM IST
Telangana inter board clarifies no syllabus change after merger keshava rao assures staff protection
Telangana Inter Board: తెలంగాణలో విద్యా వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తారన్న వార్తల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలకు తెలంగాణ ఇంటర్ బోర్డు(Telangana Inter Board) తెరదించింది. విలీన ప్రక్రియ జరిగినప్పటికీ ప్రస్తుత విద్యార్థులకు సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండవని, ప్రస్తుతం చదువుతున్న సిలబస్‌నే కొనసాగిస్తామని బోర్డు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో, బయట ప్రచారమవుతున్న నిరాధార వదంతులను ఎవరూ నమ్మవద్దని ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థులకు భరోసా ఇచ్చారు.
1 నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానానికి మద్దతు.. డ్రాపౌట్ల నివారణే లక్ష్యం:
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం ఉండాలని ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పదో తరగతి పూర్తయిన తర్వాత దాదాపు 16 శాతం మంది విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారని (డ్రాపౌట్), ఒకే గొడుగు కిందకు విద్యా వ్యవస్థ వస్తే ఈ డ్రాపౌట్లను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.
కాలేజీలకు ఒకటో తరగతి నుంచే అనుమతి.. సిబ్బందికి పూర్తి రక్షణ:
జూనియర్ కాలేజీలకు కేవలం 9, 10 తరగతులకే కాకుండా, ఒకటో తరగతి నుంచే బోధించుకునేలా అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్నాయని కేశవరావు తెలిపారు. అలాగే, ఈ విలీన ప్రక్రియ వల్ల ఇంటర్ బోర్డు ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి పూర్తి ఉద్యోగ భద్రత, రక్షణ కల్పిస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.
