Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో 120 ఏళ్ల తర్వాత భూ సర్వే.. పాస్‌బుక్కుల స్థానంలో ‘భూదార్’ కార్డులు.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ రాష్ట్రంలోలో భూ సర్వే పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy)కీలక వ్యాఖ్యలు చేశారు.
- V Santhosh Kumar
- Published on- October 5, 2026 / 07:14 PM IST
Telangana Minister Ponguleti Srinivasa Reddy announces a land survey After 120 years
Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతోందని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు. దాదాపు 120 ఏళ్ల క్రితం నిజాం, బ్రిటిష్ కాలంలో జరిగిన భూ సర్వే తర్వాత, మళ్లీ ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో మూడు విడతల్లో పూర్తిస్థాయి రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్థిక భారమైనప్పటికీ ప్రజల భవిష్యత్ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏడాదిన్నరలోనే సర్వే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి భూకమతానికి ఎల్‌పీఎం నంబర్ కేటాయించి, ‘భూదార్’ పేరుతో పక్కా పాస్‌బుక్కులు అందిస్తామన్నారు.
Ambati Rambabu: వైకాపా నేత అంబటి రాంబాబుకి షాక్.. కిర్లంపూడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు
ఆదిలాబాద్ భూ సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఉన్న సంక్లిష్టమైన భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పొంగులేటి(Ponguleti Srinivasa Reddy) ప్రకటించారు. ఇప్పటివరకు 7 జిల్లాల్లో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్షలు పూర్తి చేశామని పేర్కొన్నారు. బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన మంత్రి, తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు.
దసరా నాటికి మరో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు:
రాష్ట్రంలో పేదల గృహనిర్మాణ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రజా ప్రభుత్వం తరఫున 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, మొత్తం మీద ఇప్పటివరకు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామన్నారు. రాబోయే దసరా పండుగ నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. సర్వే ఆధారంగా గుర్తించిన 73 వేల ఇళ్లు లేని పేదలకు, గుడిసెల వాసులకు రెండో విడతలో ఇళ్ల స్థలాలు లేదా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
