Telangana Best Waterfalls: వర్షాకాలం బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్.. తెలంగాణలో జలపాతాల జోరు.. హైదరాబాద్ నుంచి రూట్ మ్యాప్ వివరాలు ఇవే
తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు జలపాతాల (Telangana Best Waterfalls)బాట పడుతున్నారు.
- V Santhosh Kumar
- Published on- July 31, 2026 / 04:23 PM IST
Telangana monsoon waterfalls travel details safety alerts
- మనోహరమైన తెలంగాణ జలపాతాల సందడి
- రైలు మరియు రోడ్డు మార్గాలు
- పర్యాటకులకు అధికారుల ముందస్తు హెచ్చరికలు
Telangana Best Waterfalls: తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు జలపాతాల బాట పడుతున్నారు. పచ్చని అడవులు, కొండల మధ్య నుంచి పరవళ్లు తొక్కే జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ పరిసరాల నుంచి వీకెండ్‌లో సులువుగా వెళ్లగలిగే ప్రముఖ జలపాతాల వివరాలు, వాటికి వెళ్లే మార్గాలు ఇవే.
1. ఆదిలాబాద్ జలపాతాల త్రివేణి సంగమం (కుంటాల, పొచ్చెర, గాయత్రి):
ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు(Telangana Best Waterfalls) ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఒక్క పర్యటనలోనే ఈ మూడింటినీ సందర్శించవచ్చు.
*కుంటాల జలపాతం: హైదరాబాద్ నుంచి సుమారు 270 కి.మీ దూరంలో ఉంటుంది. కారు లేదా బస్సులో కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్ మార్గం ద్వారా 5 నుంచి 6 గంటల్లో చేరుకోవచ్చు. రైలులో వెళ్లాలనుకునే వారు రాత్రి ‘కృష్ణా ఎక్స్‌ప్రెస్’ ఎెక్కి ఆదిలాబాద్‌లో దిగితే, అక్కడి నుంచి 60 కి.మీ రోడ్డు ప్రయాణం చేసి జలపాతాన్ని చేరుకోవచ్చు.
*పొచ్చెర జలపాతం: ఇది హైదరాబాద్ నుంచి 260 కి.మీ దూరంలో, బోథ్ వెళ్లే మార్గంలో ఉంటుంది. నిర్మల్ నుంచి 37 కి.మీ, ఆదిలాబాద్ నుంచి 47 కి.మీ దూరంలో ఉంది.
*గాయత్రి జలపాతం: కుంటాలకు అత్యంత సమీపంలో ఉండే ఈ జలపాతం హైదరాబాద్ నుంచి 260 కి.మీ దూరంలో ఉంది.
ఈ మూడింటికీ హైదరాబాద్ నుంచి నిర్మల్, ఆదిలాబాద్‌లకు నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణానికి కృష్ణా ఎక్స్‌ప్రెస్ అనుకూలంగా ఉంటుంది.
2. బొగత జలపాతం (తెలంగాణ నయాగరా):
ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతాన్ని ‘తెలంగాణ నయాగరా’ అని పిలుస్తారు. హైదరాబాద్ నుంచి ఇది 280 కి.మీ దూరంలో ఉంటుంది.
*రోడ్డు మార్గం: జనగాం, వరంగల్, ములుగు నేషనల్ హైవే గుండా సుమారు 6 గంటల్లో సులువుగా చేరుకోవచ్చు.
*రైలు మార్గం: వరంగల్ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లవచ్చు. లేదా భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) స్టేషన్‌లో దిగితే, అక్కడి నుంచి మరో 120 కి.మీ రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
పర్యాటకులకు ముఖ్య గమనిక:
ప్రస్తుతం వర్షాలు భారీగా పడుతుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్డు మార్గంలో వెళ్లేవారు ప్రయాణ పరిస్థితులను ముందే సమీక్షించుకోవడం మంచిది. అలాగే నీటి ఉధృతిని బట్టి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ పర్యాటకుల అనుమతిపై నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి పర్యటనకు వెళ్లే ముందే అక్కడ జలపాతాల సందర్శనకు అనుమతి ఉందో లేదో సరిచూసుకుని బయలుదేరడం మంచిది.
