Telangana new revenue act 2020: కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం.. తెలంగాణలోని ప్రతి ఇంచు కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం.. తెలంగాణలోని ప్రతి అంగుళం భూమిని సర్వే చేయించనుంది ప్రభుత్వం. ప్రతి సర్వే నెంబర్‌కు కోఆర్డినేట్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి భూమికి అక్షాంశాలు, రేఖాంశాలుగా.. కొలతలు నిర్దేశించనున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక.. భూమి కోసం ఎవరూ గొడవ పడే ఘటనలు ఉండబోవన్నారు సీఎం కేసీఆర్.
త్వరలోనే.. రాష్ట్రంలోని భూములకు సంబంధించి డిజిటల్ మ్యాప్ తయారుకానుంది. అది కూడా ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ కుటుంబాల డేటా బేస్ అంతా ధరణి పోర్టల్‌లో ఉండనుంది. సమగ్ర భూ సర్వే చేపట్టి.. లెక్కలన్నీ పక్కాగా తేలుస్తామని కేసీర్ భరోసానిచ్చారు. ఇంచు భూమి కూడా ఇకపై ఎవరూ ఆక్రమించుకోలేరని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు.
రెవెన్యూ శాఖ కొన్ని అధికారాలు, ఆదాయం కోల్పోయినా.. కొత్త విధానం తేవాలని సంకల్పించినట్లు చెప్పారు సీఎం కేసీఆర్. ఇకపై.. ప్రజలు ఎవరికీ నయా పైసా ఇవ్వొద్దు. కఠినమైనా సరే.. కొత్త రెవెన్యూ చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి.. కొత్త చట్టాన్ని పారదర్శకంగా అమలు చేసి భూ బకాసురులు, భూ మాఫియా నుంచి ప్రజలకు ఈ చట్టం విముక్తి కల్పిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
సమగ్ర భూ సర్వే తర్వాత.. రాష్ట్రంలోని భూముల లెక్కలన్నీ పక్కాగా తేలనున్నాయి. ఎవరికెంత భూమి ఉంది. అవి ఏఏ సర్వే నెంబర్లలో ఉన్నాయి. ఎప్పుడు అమ్మారు.. ఎప్పుడు కొన్నారు. అన్న వివరాలన్నీ పకడ్బందీగా నమోదుకానున్నాయి. పైగా.. అక్షాంశాలు, రేఖాంశాలతో.. భూముల సరిహద్దులు నిర్ణయించడం వల్ల ఒకరి భూమిని మరొకరు ఆక్రమించుకునే అవకాశం లేదని చెబుతున్నారు.
సమగ్ర భూసర్వే వల్ల వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, అటవీ భూములు, ప్రభుత్వ భూములన్నీ లెక్క తేలనున్నాయి. అన్ని రకాల భూములు రికార్డుల్లోకి ఎక్కనున్నాయి. దీని వల్ల ఎవరూ భూములు కబ్జా చేసేందుకు గానీ సరిహద్దులు మార్చేందుకు గానీ వీలుపడదు. ప్రభుత్వ భూములై ఉండి రికార్డుల్లో లేకపోతే.. ఎవరైనా ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న దాఖలాలున్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. అలాంటివి ఇక కుదరవు. వాటి రిజిస్ట్రేషన్ కూడా జరగదు.
ఒకసారి సమగ్ర భూసర్వే పూర్తయితేధరణి పోర్టల్ నుంచి ఎవరైనా భూములకు సంబంధించిన వివరాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అమ్మకం, కొనుగోలుతో పాటు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే పోర్టల్‌లో వివరాలన్నీ అప్ డేట్ అవుతాయి. ఎవరుఎక్కడున్నా సరే ఆన్‌లైన్‌లో తామున్న చోటు నుంచే ఆస్తుల వివరాలు చూసుకోవచ్చు.