Konda Sureka : మంత్రి కొండా సురేఖ బిగ్ డెసీషన్..! అనుచరులతో భేటీ.. కీలక నిర్ణయం ప్రకటించే చాన్స్..
Konda Sureka : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
- Harish Thanniru
- Published on- September 3, 2026 / 08:58 AM IST
Konda Sureka
Konda Sureka : తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్ర క్యాబినెట్‌ను ప్రక్షాళన చేసే అవకాశం ఉందని.. ఇందులో భాగంగా ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించే అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి తప్పించే విషయంపై పార్టీ అధిష్టానం ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాసిక్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి వచ్చిన తర్వాత కొండా సురేఖ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇవాళ లేదంటే రేపు కొండా సురేఖ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
మరోవైపు.. మంత్రి పదవి నుంచి తొలిగించే అవకాశం ఉందన్న సమాచారంతో కొండా సురేఖ కూడా అందుకు తగ్గట్లుగా సంచలన నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధిష్టానం నిర్ణయం వెలువడగానే తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించేందుకు కొండా దంపతులు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌లోని తమ అనుచరులంతా హైదరాబాద్ రావాల్సిందిగా కొండా ఫ్యామిలీ పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై తమ అనుచరులతో జరిగే సమావేశంలో చర్చించి.. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తే ఏం చేయాలి.. ఏవిధంగా ముందుకు వెళ్లాలి.. అనే విషయాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కొండా సురేఖ కలిశారు. ఆ తరువాత మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆమె సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకుంటున్నారని అది క్రమ శిక్షణా చర్యల కిందకు రావా? అంటూ సురేఖ మీడియా వేదికగా సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందుగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలన్నారు. తన రాజీనామా కోరుతూ ఇప్పటివరకు ఎవరూ తనను సంప్రదించలేదని కూడా ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే అవకాశం ఉందని విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటనకు ముందే రాజీనామా చేసి.. తమ కార్యాచరణను ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా కొండా దంపతులు తమ వర్గీయులతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
