RTC Strike : ప్రయాణికులకు అలర్ట్.. నేటి అర్థరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు
RTC Strike : నేటి అర్థరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది.
- Dharani Pilli
- Updated on- April 21, 2026 / 09:17 AM IST
telangana rtc workers announce strike from april 21st announces by JAC
- నేటి అర్థరాత్రి నుంచి ఆర్టీసీలో సమ్మె సైరన్
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
- ప్రత్యామ్నయ మార్గాలు అన్వేషిస్తున్న సర్కార్
RTC Strike : నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు తిరగవా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కారణం నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు దిగడానికే నిర్ణయించుకున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు.. పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపు వంటి సమస్యలపై ఉద్యోగులు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభం కాబోయే ఈ సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. సమ్మె నిర్ణయంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది.
ఇదిలా ఉంటే ఆర్టీసీ జేఏసీలో లేని ఇతర కార్మిక సంఘాలు సైతం సమ్మెకు మద్దతు ఇచ్చాయి. దీంతో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సోమవారం ఉదయం ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమ్మె నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్లు తెలిసింది.
ఇదిలా ఉంటే సమ్మె నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు బలంగా నిలబడి ఉన్నారు. ఇది మరో సకల జనుల సమ్మెగా మారుతుంది అంటున్నారు. ఈ సమ్మెకు అందరి సహకారం సంపూర్ణంగా ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం.. ప్రైవేటు సిబ్బందితో సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తే… ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసన్నారు. సమ్మెను విజయవంతం చేసి సమస్యలను పరిష్కరించుకుంటామని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. సమస్యలపై మంగళవారం మధ్యాహ్నంలోగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే.. మెజార్టీ యూనియన్ల జేఏసీగా తామూ సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక, ప్రధాన కార్యదర్శి అశ్వత్ధామ రెడ్డి తెలిపారు.
