Telangana SSC: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల.. నవంబర్ 26 లాస్ట్ డేట్.. పూర్తి వివరాలు మీకోసం!

తెలంగాణలో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి(Telangana SSC) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది.

Telangana ssc 10th class exam fee schedule released last date november 26

Telangana SSC: తెలంగాణలో 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి (ఎస్సెస్సీ), ఓఎస్సెస్సీ, వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక ప్రకటన విడుదల చేసింది. పరీక్ష ఫీజుల చెల్లింపు షెడ్యూల్‌ను సోమవారం అధికారికంగా ప్రకటించిన అధికారులు, రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకసారి ఫెయిలైన (Once Failed) అభ్యర్థులు ఆలస్య రుసుము లేకుండా ఈ నెల నవంబర్ 26 వరకు తమ పాఠశాలల్లో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్ విధానం ద్వారా నవంబర్ 27 నుంచి 30వ తేదీ లోపు ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసి, విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులకు (DEO) సమర్పించాల్సి ఉంటుంది.

Cyclone Aqwan Effect On Telangana: తెలంగాణపై ‘అక్వాన్‌’ తుపాను ఎఫెక్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఐఎండీ కీలక హెచ్చరిక!

ఆలస్య రుసుము తేదీలు.. సబ్జెక్టుల వారీగా ఫీజుల పూర్తి వివరాలు ఇవే:

నిర్ణీత గడువులోపు ఫీజు(Telangana SSC) చెల్లించలేని విద్యార్థుల కోసం ఆలస్య రుసుముతో కూడిన అదనపు తేదీలను కూడా ప్రకటించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8 వరకు (డిసెంబర్ 9లోగా ఖజానాకు జమ, 11లోగా డీఈవోలకు వివరాలు), రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 10 నుంచి 21 వరకు (డిసెంబర్ 22లోగా జమ, 28లోగా డీఈవోలకు వివరాలు), అలాగే రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 23 నుంచి 2027 జనవరి 4 వరకు (జనవరి 5లోగా జమ, 6లోగా డీఈవోలకు వివరాలు) చెల్లించే అవకాశం కల్పించారు. ఇక పరీక్ష ఫీజు విషయానికి వస్తే అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125, మూడు సబ్జెక్టుల లోపు రాసే వారికి రూ.110, వొకేషనల్ విద్యార్థులకు రూ.125 తో పాటు అదనంగా రూ.60 చెల్లించాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లింపులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించరు:

పరీక్ష ఫీజులను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లోని పాఠశాల లాగిన్ ద్వారా సైబర్ ట్రెజరీకి అనుసంధానించిన ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ చలానాలు గానీ, మాన్యువల్ బ్యాంకు చలానాలను గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తేల్చి చెప్పారు. ప్రధానోపాధ్యాయులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి నామినల్ రోల్స్‌ను గడువులోగా సమర్పించాలని, ప్రకటించిన ఫీజు చెల్లింపు తేదీలను మళ్లీ పొడిగించే ప్రసక్తే లేనందున విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించాలని సూచించారు.