Auto Fare Hike: తెలంగాణలో పెరిగిన ఆటో ఛార్జీలు.. అధికారిక ఉత్తర్వులు జారీ.. ఎంత పెరిగాయో తెలుసా?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో రిక్షా ఛార్జీలను(Auto Fare Hike) సవరిస్తూ రవాణా శాఖ శుక్రవారం అధికారికంగా జీవో విడుదల చేసింది.
- V Santhosh Kumar
- Published on- October 2, 2026 / 04:49 PM IST
Telangana Transport Department issued official order increasing auto-rickshaw fares.
Auto Fare Hike: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు రవాణా శాఖ ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో ఆటో రిక్షా ఛార్జీలను సవరిస్తూ రవాణా శాఖ శుక్రవారం అధికారికంగా జీవో విడుదల చేసింది. ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటో ఛార్జీల పెంపుపై ఆటో(Auto Fare Hike) డ్రైవర్ల సంఘాలు సుదీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం, నూతన ధరలను అమలుల్లోకి తెస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
కనీస ఛార్జీ రూ.30.. నైట్ ఛార్జీలలోనూ కీలక మార్పులు:
కొత్తగా నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఆటో కనీస ఛార్జీ (మొదటి 1.6 కిలోమీటర్లకు) రూ.30గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు రూ.14 చొప్పున వసూలు చేసుకోవడానికి అధికారులు అనుమతినిచ్చారు. అంతేకాకుండా, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణించే ప్రయాణికుల నుంచి కనీస ఛార్జీపై ఒకటిన్నర రెట్లు (50% అదనంగా) నైట్ ఛార్జీ వసూలు చేసే వెసులుబాటును ఆటో డ్రైవర్లకు కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
3 నెలల్లో డిజిటల్ మీటర్లు తప్పనిసరి.. అమలులో కఠిన నిబంధనలు:
ఛార్జీల వసూళ్లలో పారదర్శకత పెంచేందుకు, ప్రయాణికుల నుంచి అధిక వసూళ్లను అరికట్టేందుకు రవాణా శాఖ కఠిన ఆదేశాలిచ్చింది. రాబోయే 3 నెలల వ్యవధిలో రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరూ తప్పనిసరిగా తమ వాహనాలకు డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. నియమాలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
