RTO New Rules: ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందటం అంతా ఈజీ కాదు.. ‘ఫేస్ రికగ్నైజేషన్’ టెస్ట్ తప్పనిసరి.. RTO కొత్త రూల్స్ ఇవే

తెలంగాణలో పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ (RTO New Rules)కోసం ఈ ఆన్‌లైన్ పరీక్షను రవాణా శాఖ తప్పనిసరి చేసింది.

Telangana transport department new driving license rules mandatory online video test face recognition

RTO New Rules: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. వాహనం నడపడం కేవలం ఒక నైపుణ్యం మాత్రమే కాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం బాధ్యతాయుతమైన సామాజిక కర్తవ్యమని గుర్తించిన ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్(RTO New Rules) పొందాలనుకునే దరఖాస్తుదారులు స్టీరింగ్ పట్టడానికి ముందే డిజిటల్ రూపంలో రోడ్డు భద్రతా పాఠాలు నేర్చుకోవడం, వాటిపై పరీక్షలు రాయడం తప్పనిసరి చేశారు.

CM Vijay: విజయవాడలో తమిళనాడు సీఎం విజయ్.. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం.. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు!

ఆరు మాడ్యూల్స.. రెండున్నర గంటల ఆన్‌లైన్ కోర్సు:

లెర్నింగ్ లైసెన్స్ (LLR) పొందిన వారు శాశ్వత లైసెన్స్ కోసం వెళ్లే క్రమంలో సుమారు రెండున్నర గంటల డిజిటల్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం 6 మాడ్యూల్స్‌లో 120కి పైగా చిన్న వీడియోల ద్వారా సిగ్నల్ వ్యవస్థ, అతివేగం వల్ల కలిగే ప్రమాదాలు, ప్రమాదకర మలుపు వద్ద పాటించాల్సిన జాగ్రత్తలను వివరంగా నేర్పిస్తారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఈ వీడియో కోర్సు అందుబాటులో ఉంటుంది.

ఫేస్ రికగ్నైజేషన్‌తో పర్యవేక్షణ.. తల తిప్పినా వీడియో కట్:

దరఖాస్తుదారుడి ఫోన్‌కు వచ్చే లింక్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వగానే ‘ఫేస్ రికగ్నైజేషన్’ ద్వారా అభ్యర్థి ముఖాన్ని స్కాన్ చేసి వీడియో ప్రారంభమవుతుంది. ఈ కోర్సులో అక్రమాలను అరికట్టేందుకు పకడ్బందీ సాంకేతికతను జోడించారు. వేరే వ్యక్తి వీడియో చూసినా, లేదా అభ్యర్థి కనీసం తల పక్కకు తిప్పినా వీడియో ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ ఆన్‌లైన్ వీడియో పాఠాలను మధ్యలో ఆపి, మరుసటి రోజు కూడా కొనసాగించే వెసులుబాటు కల్పించారు.

వీడియో టెస్ట్ పాసైతేనే స్లాట్ బుకింగ్.. యాదాద్రి, సూర్యాపేటలో పైలట్ ప్రాజెక్ట్:

వీడియోలను పూర్తిగా చూసిన తర్వాత నిర్వహించే అసెస్‌మెంట్ టెస్టులో కనీస మార్కులు సాధిస్తేనే పర్మినెంట్ లైసెన్స్ ఫీజు చెల్లించి ఆర్టీఓ (RTO) డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ నూతన విధానాన్ని యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ లభించే సత్ఫలితాల ఆధారంగా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్‌టీఓ కార్యాలయాల్లో విస్తరించేందుకు రవాణా శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.