TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు బిగ్‌షాక్.. ఇకనుంచి ఆ ఇంక్రిమెంట్ రద్దు..
TGSRTC : టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు, అధికారులకు ఫ్యామిలీ ప్లానింగ్ స్కీం కింద ఇచ్చే స్పెషల్ ఇంక్రిమెంట్‌ను నిలిపివేయనుంది.
- Harishth Thanniru
- Published On : March 18, 2026 / 02:34 PM IST
TGSRTC
- ఉద్యోగులకు బిగ్ షాకిచ్చిన టీజీఎస్ఆర్టీసీ
- ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్‌పై ఇచ్చే ఇంక్రిమెంట్ రద్దు
- తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి
TGSRTC : టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు, అధికారులకు ఫ్యామిలీ ప్లానింగ్ స్కీం కింద ఇచ్చే స్పెషల్ ఇంక్రిమెంట్‌ను నిలిపివేయనుంది. ఈ మేరకు మంగళవారం సర్క్యూలర్ సైతం జారీ చేసింది.
ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా .. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నా యాజమాన్యం ఈ ఇంక్రిమెంట్‌ను ఇవ్వదు. ఫ్యామిలీ ప్లానింగ్ స్కీం కింద ఇకపై స్పెషల్ క్యాజువల్ లీవ్ మాత్రమే కొనసాగుతుందని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీ బోర్డు తీర్మానం ఆధారంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి ప్రభుత్వం 2006లోనే ఈ స్కీమ్ ను రద్దు చేసింది. అయినప్పటికీ.. ఆర్టీసీలో మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు దీనికి ఆర్టీసీ యాజమాన్యంకూడా స్వస్తి పలికింది. గతంలో ఇద్దరు లేదా అంతకంటే తక్కువ పిల్లలు ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే పర్సనల్ పే రూపంలో ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ లభించేది. అయితే, తాజాగా .. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో కొత్తగా ఆపరేషన్ చేయించుకునే వారికి ఎలాంటి అదనపు జీతపు పెరుగుదల ఉండదు.
ఇదిలాఉంటే.. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోత్సాహక ఇంక్రిమెంట్ ను రద్దు చేయడాన్ని ఆర్టీసీలో కార్మిక సంఘం ఎస్‌డబ్ల్యూఎఫ్ (స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్) ఖండించింది. ఇది కార్మికులకు అన్యాయం చేయడమేనని ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధానకార్యదర్శి వీఎస్ రావు పేర్కొన్నారు.
