×
Ad

కేసీఆర్ చుట్టూ ఆ పది మంది..! కేటీఆర్, హరీశ్‌ చుట్టూ వారే.. మరెవ్వరిని దగ్గరకు రానివ్వని ఆ పది మంది..

కేసీఆర్‌ను చూసేందుకు నేతలు, కార్యకర్తలు తోసుకుంటూ వచ్చేసరికి కేటీఆర్ కూడా కింద పడబోయారు. ఓ సందర్భంలో కేటీఆర్‌ను వెనక్కి లాగే పరిస్థితి నెలకొంది.

KCR: అధినేత కేసీఆర్ నుంచి మొదలు కీలక నేతలైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును..నేతలు, కార్యకర్తలతో కలవనివ్వకుండా కొంత మంది అడ్డుగోడల్లా నిలుస్తున్నారన్న చర్చ తెలంగాణ భవన్ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అంటే ప్రోటోకాల్, సెక్యూరిటీ, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు కలవలేకపోయారు.

కానీ ఆ తర్వాత అడపాదడపా కేసీఆర్ పాల్గొంటున్న సభలు, సమావేశాల్లోనూ ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవ్వరిని రానివ్వడం లేదన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇలా కేసీఆర్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటున్నది ఆయన గన్ మెన్‌లో, సెక్యూరిటీ సిబ్బంది కాదట. బీఆర్ఎస్ (KCR) పార్టీలోని కొంత మంది ముఖ్యనేతలు మిగతా పార్టీ నేతలెవ్వరిని కేసీఆర్ దగ్గరకు రానివ్వడం లేదన్నది ఇక్కడ పాయింట్.

తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఈ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదన్నది పార్టీ నేతల వాదన. అధినేత కేసీఆర్ వచ్చినప్పుడే కాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విషయంలోనూ ఇలాగే జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ను ఎలాగూ కలవలేకపోతున్నామని భావించే చాలా మంది లీడర్లు, కార్యకర్తలు కేటీఆర్, హరీశ్‌రావును కలిసేందుకు తెలంగాణ భవన్‌కు వస్తుంటారు. కానీ ఇక్కడ కూడా ఆ పది మందే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Balineni Srinivasa Reddy: జనసేనలో బాలినేనికి ఊహించని పరిస్థితులు..!?

కేటీఆర్, హరీశ్‌రావుల వచ్చిరాగానే ఆ పది మంది వాళ్ల చుట్టూ చేరిపోతారట. కేటీఆర్, హరీశ్‌ తిరిగి తెలంగాణ భవన్ నుంచి వెళ్లిపోయే వరకు పక్కకు జరగకుండా అడ్డుగోడలా ఉండిపోతున్నారట. దీంతో మిగతా నేతలు, కార్యకర్తలు అస్సలు కేటీఆర్, హరీశ్‌రావును కలిసేందుకు వీలుపడటం లేదట. మొన్న పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చినప్పుడు కూడా ఆ పది మంది నేతల హడావుడే ఎక్కువగా కనిపించిందన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చే వరకు హడావుడి చేసి, మళ్లీ కేసీఆర్ రాగానే ఆయన చుట్టూ ఉండాలని ఆ పది మంది ప్రయత్నించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

నేతలు, కార్యకర్తలు తోసుకుంటూ వచ్చేసరికి..
కేసీఆర్‌ను చూసేందుకు నేతలు, కార్యకర్తలు తోసుకుంటూ వచ్చేసరికి కేటీఆర్ కూడా కింద పడబోయారు. ఓ సందర్భంలో కేటీఆర్‌ను వెనక్కి లాగే పరిస్థితి నెలకొంది. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ భవన్ ఇంచార్జ్‌ రావుల చంద్రశేఖర్ రెడ్డి కేసీఆర్‌కు కండువా కప్పిన తర్వాత లోపలికి వెళ్లే క్రమంలో తోపులాటకు కింద పడిపోయారు. ఆయనపై నుంచి నేతలు, కార్యకర్తలు వెళ్లడంతో అలర్ట్ అయిన మరికొంత మంది ఆయనను పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి మొహానికి, కాలికి గాయాలయ్యాయి. ఈ పరిస్థితిపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ భవన్‌కు కేసీఆర్ వచ్చేంత వరకు క్రౌడ్ కంట్రోల్ చేసిన నేతలు.. అధినేత రాగానే ఎప్పటిలా అయన చుట్టూ చేరిపోవడంతో పెద్దఎత్తున తోపులాట జరిగింది. పోనీ కేసీఆర్ అంటే ఎప్పుడో ఒకసారి తెలంగాణ భవన్‌కు వస్తారని సరిపెట్టుకున్నా..రెగ్యులర్‌గా తెలంగాణ భవన్ వచ్చే కేటీఆర్, హరీశ్‌రావు విషయంలోనూ ఇదే జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. భవన్‌లోనే కాకుండా ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా ఆ పది మంది చుట్టూ చేరి మరెవ్వరిని కేటీఆర్, హరీశ్‌రావు దగ్గరకు రానివ్వడం లేదని పార్టీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారట. మరి ఈ విషయాన్ని కేటీఆర్, హరీశ్‌రావులు గమనించారో లేదో గానీ..ఇది పార్టీకి నష్టం చేస్తుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.