Chain Snatching: మేడలో గొలుసు లాక్కొని బావిలోకి నెట్టేసాడు.. బావిలో 24 గంటలు నరకం.. కరీంనగర్‌లో ఘోరం
కరీంనగర్ జిల్లా కిసాన్‌నగర్‌కు చెందిన కూలీ గంగాధర లక్ష్మి బుధవారం ఉదయం పని కోసం(Chain Snatching) అడ్డా వద్దకు వెళ్లారు.
- V Santhosh Kumar
- Published on- July 3, 2026 / 08:10 AM IST
Thief Snatched chain from a lady and pushed into the well.
- మహిళను బావిలోకి తోసేసిన దుండగుడు
- పైపు పట్టుకుని ప్రాణాలతో బయటపడింది
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
Chain Snatching: కరీంనగర్ జిల్లా కిసాన్‌నగర్‌కు చెందిన కూలీ గంగాధర లక్ష్మి (55) బుధవారం ఉదయం పని కోసం అడ్డా వద్దకు వెళ్లారు. అక్కడ ఒక గుర్తుతెలియని వ్యక్తి పని ఇప్పిస్తానని నమ్మించి, ఆమెను నుస్తులాపూర్ వైపు తీసుకెళ్లాడు. హైవేకు సమీపంలోని ఒక నిర్జన వ్యవసాయ భూమి వద్దకు చేరగానే, ఆ కిరాతకుడు ఆమె మెడలోని బంగారు గొలుసు(Chain Snatching), ఒక చెవికమ్మను బలవంతంగా లాక్కున్నాడు. ఆపై సాక్ష్యం లేకుండా చేసేందుకు లక్ష్మిని పక్కనే ఉన్న లోతైన బావిలోకి నెట్టేసి పారిపోయాడు.
బావిలో 24 గంటల నరకం:
బావిలో పడిపోయిన లక్ష్మి చాకచక్యంగా అక్కడి మోటార్ పైపును గట్టిగా పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నారు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆమె అరుపులు ఎవరికీ వినబడలేదు. దాంతో దాదాపు 24 గంటల పాటు ఆమె ఆ బావిలోనే నరకయాతన అనుభవించారు. గురువారం ఉదయం పొలం యజమాని బావి వద్దకు రాగా, లోపలి నుంచి వచ్చిన శబ్దాల ఆధారంగా ఆమెను గుర్తించారు. వెంటనే స్థానికుల సహాయంతో తాడుకు మంచం కట్టి లోపలికి దించి లక్ష్మిని సురక్షితంగా బయటకు తీశారు.
పోలీసుల దర్యాప్తు:
బుధవారం నుంచి లక్ష్మి ఇంటికి రాకపోవడంతో కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పటికే మిస్సింగ్ కేసు నమోదైంది. ఆమె లభ్యతపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సదరు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
