Mother Killed Baby : హైదరాబాద్‌లో దారుణం.. తొమ్మిది నెలల చిన్నారిని చెరువులో ముంచిన తల్లి..!
Mother Killed Baby : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిది నెలల బిడ్డను చెరువులో ముంచి తల్లి హత్య చేసింది.
- Harish Thanniru
- Published on- August 2, 2026 / 10:35 PM IST
Mother Killed Baby
Mother Killed Baby : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. మాతృత్వానికి మచ్చ తెచ్చింది. తన చేతులతోనే తొమ్మిది నెలల పసిబిడ్డను చెరువులో ముంచింది.
ఈ ఘటన ఆదివారం సాయంత్రం 6.30గంటలకు ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్‌గూడలో చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని చెరువులో నుండి వెలికితిసి.. పోస్టులమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిందితురాలైన తల్లి లోకసాని రాజేశ్వరి(34)ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజాపూర్ ప్రాంతానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళకు తొమ్మిది నెలల కుమార్తె లోకసాని అనురాధ ఉంది. తీవ్రంగా మద్యానికి బానిసైన రాజేశ్వరి ఘటన జరిగిన సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మత్తులో విచక్షణ కోల్పోయిన ఆమె మానవత్వం లేకుండా తన తొమ్మిది నెలల చిన్నారి అనురాధను బైరామల్‌గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి దారుణంగా హత్య చేసింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
