Hyderabad To Komaraveli Train : హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి వెళ్లేందుకు అందుబాటులోకి రైలు.. టికెట్ ధర ఎంతో తెలుసా? ట్రైన్ టైమింగ్స్ ఇవే..
Hyderabad To Komaraveli Train : మురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
- Harish Thanniru
- Updated on- July 26, 2026 / 02:45 PM IST
Hyderabad to komaraveli train
Hyderabad To Komaraveli Train : తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయం ఒకటి. భక్తులు కోరిన కోర్కెలను తీర్చుతూ వారి కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఈ దేవాలయంకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రతీయేటా మల్లన్న బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కొమురవెల్లికి తరలివస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలోనే కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి వస్తుంటారు. అయితే, ఇక్కడికి వచ్చే భక్తులు ఇప్పటికీ ఎక్కువగా రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వస్తుంది. తాజాగా.. కొత్తగా రైలు అందుబాటులో రావడంతో భక్తుల కష్టాలు తీరినట్లయింది.
మనోహరాబాద్ నుంచి కొత్త పల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా సాంకేతిక కారణాలతో మొదట లకుడారం వద్ద రైల్వే స్టేషన్ ను నిర్మించారు. దీంతో కొమురవెల్లికి వచ్చే భక్తులు లకుడారం స్టేషన్ దిగి 12 కిలో మీటర్ల దూరం ఆటోల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొమురవెల్లి వద్ద హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు సాంకేతిక సమస్య ప్రధాన అడ్డంకి మారడంతో స్థానికులు, భక్తులు రాష్ట్ర , కేంద్ర మంత్రులతో పాటు గవర్నర్ లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో రైల్వే అధికారులు పరిశీలించారు. దీంతో కొమరవెల్లిలో దాదాపు రెండేండ్ల కిందట రైల్వే హాల్ట్ స్టేషన్‌కు భూమి పూజ నిర్వహించగా ఇప్పటికీ పనులు పూర్తవడంతో ఆదివారం ప్రారంభించారు.
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ప్రతి ఏడాది సుమారు 25 లక్షల మంది భక్తులు కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటుండగా, జాతర సమయంలోనే 10లక్షలకు పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు.
రాజీవ్ రహదారికి సమీపంలో నిర్మించిన ఈ హాల్ట్ స్టేషన్‌లో 400 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్, వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్లు, షెల్టర్ సీటింగ్, తాగునీరు, ఇతర ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మరో రైల్వే ట్రాక్ నిర్మాణానికి కూడా అవకాశం ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. స్టేషన్ నుంచి ఆలయ ప్రధాన రహదారి వరకు ప్రత్యేకంగా సీసీ రోడ్డును నిర్మించారు. హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి ప్రయాణించే వారికి సుమారు రూ.20, సిద్దిపేట నుంచి వచ్చే వారికి రూ.10 టికెట్ ధరగా నిర్ణయించారు.
కొమురవెల్లి పుణ్య క్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం కారవడంతో సిద్ధిపేట- సికింద్రాబాద్ మధ్య నడిచే డెమో రైళ్లకు కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో హాల్ట్ కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
• రైలు నంబరు 77654 (సిద్దిపేట – సికింద్రాబాద్): ప్రతిరోజు మధ్యాహ్నం 2:38 గంటలకు కొమురవెల్లికి చేరుకుంటుంది (బుధవారం మినహా).
• రైలు నంబరు 77655 (సికింద్రాబాద్ – సిద్దిపేట): రాత్రి 8:04 గంటలకు కొమురవెల్లి స్టేషన్‌లో ఆగుతుంది (బుధవారం మినహా).
• రైలు నంబరు 77656 (సిద్దిపేట – సికింద్రాబాద్): ఉదయం 7:04 గంటలకు ఇక్కడ ఆగుతుంది (గురువారం మినహా).
• రైలు నంబరు 77653 (సికింద్రాబాద్ – సిద్దిపేట): మధ్యాహ్నం 12:52 గంటలకు కొమురవెల్లిలో నిలుస్తుంది (బుధవారం మినహా).
