YS Sharmila’s comments : వైఎస్ షర్మిల వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మీడియాతో నిన్నటి చిట్ చాట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికతను షర్మిల ప్రశ్నించడాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదంటున్నారు. ప్రత్యేక ఉద్యమ కాలంలో సమైక్యాంధ్ర అన్న షర్మిల ఇప్పుడు తెలంగాణపై ప్రేమ నటిస్తున్నారని మండిపడుతున్నారు.
షర్మిల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చని, అయితే షర్మిలకు అనుకూలమైన పరిస్థితులు తెలంగాణలో ఇప్పుడు లేవని బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణ ప్రజలు రామరాజ్యం కోరుకుంటున్నారు కానీ రాజన్న రాజ్యం కాదంటున్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు ప్రథమ శత్రువు జగన్ అని, తెలంగాణ ప్రజలపై షర్మిలకు ప్రేమ ఉంటే అన్నతోనే మొదటగా పోరాడాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
కేసీఆర్ పుట్టక గురించి షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. నాడు నై తెలంగాణ అన్న షర్మిల.. ఇప్పుడు జై తెలంగాణ అంటే ఎవరూ నమ్మబోరన్నారు. తెలంగాణ కోసం మద్దతుగా షర్మిల ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. అయితే ప్రతిపక్షంలో ఎవరున్నా తమకు ఇబ్బందిలేదన్న జీవన్‌రెడ్డి.. షర్మిలను మాత్రం ఆడబిడ్డగా, తెలంగాణ కోడలిగానే చూస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం షర్మిల పనిచేయాలంటే మొదట జగన్‌తోనే ఆమె పోరాడాల్సి ఉంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్‌కుమార్ అన్నారు. కృష్ణా జలాలల విషయంలో జగన్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని.. ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే ఆమె జగన్‌తోనే పోరాడాలన్నారు. షర్మిల పార్టీ విధి విధానాల బట్టే ఆమె తెలంగాణలో ఆదరణ ఎలా ఉంటుందన్ని తెలుస్తుందని శ్రవణ్ అభిప్రాయపడ్డారు.
అన్నాచెల్లెల్ల మధ్య సఖ్యతే లేనప్పుడు షర్మిలను తెలంగాణ ప్రజలు ఎలా ఆదరిస్తారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు. తెలంగాణలో అమరవీరుల కుటుంబాలను పరామర్శిస్తానని చెబుతున్న షర్మిల.. వారు ఎందుకు అమరులయ్యారో చెప్పాలన్నారు. తెలంగాణేతరుల పాలనను ఇక్కడి ప్రజలు ఆదరించబోరన్నారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకోవడం లేదన్న ఆయన.. రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.