ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
ట్రైనీ మహిళా ఆఫీసర్ మీద లైంగిక వేధింపులకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఉదయ్ ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారం జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నుంచి ఉదయ్ కనిపించడం లేదు.
- Ashok Bonepalli
- Updated on- July 28, 2026 / 06:29 PM IST
ఉదయ్ కృష్ణారెడ్డి (File Photo)
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ను వేధింపులకు సంబంధించిన కేసులో మిర్యాల గూడ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మహిళా ట్రైనీ ఆఫీసర్ హైదరాబాద్ అత్తాపూర్ లో కేసు నమోదు చేయడంతో ఆయన్ను అత్తాపూర్ కు తరలిస్తున్నారు.
ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి జూలై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆ వెంటనే ఉదయ్ ఆత్మహత్యాయత్నం చేశాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, అతడు అతిగా మద్యం తాగడం వల్ల అపస్మారక స్థితికి చేరుకున్నాడని, అతడి శరీరంలో ఎలాంటి పాయిజన్ ఆనవాళ్లు లేవని ఉదయ్ కు చికిత్స అందించిన డాక్టర్లు స్పష్టం చేశారు.
అదే సమయంలో ఉదయ్ సూసైడ్ లెటర్ అంటూ కూడా ఓ పేపర్ వైరల్ అయింది. అయితే, తాను మద్యంమత్తులో రాసి ఉంటానని ఉదయ్ క్లారిటీ ఇవ్వడంతో దానికి ఫుల్ స్టాప్ పడింది. మరోవైపు ఈ కేసు విచారణ జరుపుతున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నేషనల్ అకాడమీలో ట్రైనింగ్ సందర్భంగా అతడు ఇచ్చిన రెండు అడ్రస్ లను పోలీసులు వెతికారు. అతడికి నోటీసులు ఇచ్చేందుకు ఆ అడ్రస్ కు వెళ్లగా ఉదయ్ కనిపించలేదు. అతడి సెల్ ఫోన్ కూడా స్విచాఫ్ వచ్చింది. దీంతో అతడు పారిపోయాడంటూ ప్రచారం జరిగింది.
తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. తమ సొంతూరు ఊళ్లపాలెంలో ఉన్నానని చెప్పారు. తన కోసం పోలీసులు వెతికినవి టెంపరరీ అడ్రస్ లు అని తెలిపారు. నానమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే తాను సొంతూరుకు వచ్చినట్టు చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న ఉదయ్ పోలీసులకు సహకరిస్తానని చెప్పారు. చట్టం మీద తనకు నమ్మకం ఉందని, తనపై వచ్చిన ఆరోపణలను లీగల్ ఎదుర్కొని నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు.
