×
Ad

వాటి గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

"కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం మంత్రులు కొట్టుకుంటున్న పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారు" అని తెలిపారు.

Revanth Reddy, Kishan Reddy

  • కాంగ్రెస్‌కు ఓట్లేయాలని సీఎం అడుగుతున్నారు
  • ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
  • 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల గురించి మాట్లాడట్లే

Kishan Reddy: కాంగ్రెస్‌కు ఓట్లేయాలని అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల గురించి మాత్రం మాట్లాడడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు.

“నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2,500, రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, తులం బంగారం, బీసీలకు రూ.లక్ష కోట్లు అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు.

Also Read: Hyderabad: లోన్‌ యాప్‌ మోసగాళ్ల బారిన పడ్డ మరో వ్యక్తి.. సైబర్‌ నేరగాళ్లు ఎలా వేధించారంటే?

వాటిలో ఏ హామీపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడటం లేదు. ఇచ్చిన గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫైఫల్యం చెందింది. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు ముఖ్యమంత్రి తెర లేపుతున్నారు.

కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం మంత్రులు కొట్టుకుంటున్న పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం సర్వ సాధారణమైంది. గత ప్రభుత్వం తెచ్చిన 4 శాతం మతపరమైన రిజర్వేషన్లను హైకోర్టు రెండుసార్లు కొట్టివేసింది.

శాశ్వత ప్రాతిపాదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం దురదృష్టకరం. ముస్లిం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లిం అని అనడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనంగా నిలుస్తోంది” అని తెలిపారు.

“తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలి. రెండు పార్టీల అవినీతి విధానం ఒక్కటే. ప్రజలు రెండు పార్టీల నుంచి తెలంగాణను రక్షించుకోవాలి. ఇష్టారాజ్యంగా సీఎం వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారు. 27 నెలలు కావస్తోంది. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డికి యాక్షన్ ప్లాన్ లేదు. ఉన్నత విద్య కోసం ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లొచ్చారు. హార్వర్డ్ లో ఉన్నత విద్య చదివిన తర్వాత మార్పు వస్తుందని అనుకున్నారు. కానీ సీఎంలో ఎలాంటి మార్పు రాలేదు” అని అన్నారు.