Weather Updates : వాతావరణ శాఖ బిగ్ అప్డేట్.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. దేశవ్యాప్తంగా జల్లులు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాలకు ఎంట్రీ అప్పుడే…
Weather Updates : భారతదేశంలో రుతుపవనాల అధికారిక ప్రవేశాన్ని కేరళకు చేరుకున్నప్పుడు గుర్తించడం జరుగుతుంది. రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళకు చేరుతాయి. నైరుతి రుతుపవనాలు భారతదేశంలో ప్రధాన వర్షాకాలంగా గుర్తించబడుతుంది.
- Harish Thanniru
- Published on- May 9, 2026 / 08:31 AM IST
southwest monsoon
- రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్
- ఈనెల 20న అండమాన్ కు రాక
- ఇప్పటికే దేశ వ్యాప్తంగా జల్లులు ప్రారంభం
Weather Updates : తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మూడరోజుల క్రితం వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టింది. దీంతో అత్యధికంగా 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతోపాటు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 10రోజుల్లో రుతుపవనాలు వచ్చేస్తున్నాయని తెలిపింది.
భారతదేశంలో రుతుపవనాల అధికారిక ప్రవేశాన్ని కేరళకు చేరుకున్నప్పుడు గుర్తించడం జరుగుతుంది. రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళకు చేరుతాయి. నైరుతి రుతుపవనాలు భారతదేశంలో ప్రధాన వర్షాకాలంగా గుర్తించబడుతుంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఈనెల 20వ తేదీన అండమాన్ సముద్రంలోకి సకాలంలో ప్రవేశించే అవకాశం ఉంది. మే 14 నుంచి 20 తేదీల మధ్యలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశం జరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రుతుపవనాలకు ముందు కురిసే జల్లులు కురుస్తాయని పేర్కొంది.
ఈనెల మూడవ వారంలో నైరుతి గాలులు వీస్తాయని, బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశ సరిహద్దు వెంబడి దిగువ, మధ్య స్థాయి ట్రోపోస్ఫెరిక్ ఆక్షాంశాల వద్ద బలపడతాయని ఐఎండీ తెలిపింది. ఈ కారణంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ మధ్యలో కేరళ, తమిళనాడు, దక్షిణ ద్వీపకల్పంలోని ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలోని అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు తీవ్రతతో కూడిన వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
రైతులు కీలకమైన ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు వంటి పంటలను సాగు చేస్తారు. ఈ క్రమంలో నైరుతి వర్షపాత విస్తరణ, వానలు పడే సమయం అనేవి చాలా కీలకం. రుతుపవనాల కారణంగా కురిసే వర్షాలపైనే రైతులు ఖరీఫ్ సీజన్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇవాళ తెలంగాణలో 39 డిగ్రీల సెల్సియస్ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఏపీలో 38 డిగ్రీల సెల్సియస్ వరకూ వేడి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తేమ తెలంగాణలో 28 శాతం, ఏపీలో 38 శాతం ఉంటుంది. ఇలా తేమ తగ్గిపోవడం వల్ల.. వర్షాలు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ.. చుట్టూ ఉన్న ద్రోణి వాతావరణం వల్ల మే 10 నుంచి ఏపీ, తెలంగాణలో జోరుగా వర్షాలు పడే అవకాశాలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
