Malkajgiri: ఆపరేషన్ మల్కాజిగిరి.. మైనంపల్లికి చెక్ చెప్పేలా దీటైన నేత కోసం బీఆర్‌ఎస్ అన్వేషణ
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో మరోసారి పాగా వేసేలా అధికార పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషిస్తోంది బీఆర్‌ఎస్.
- Naga Srinivasa Rao Poduri
- Published On : September 25, 2023 / 10:33 AM IST
who is BRS party candidate in malkajgiri constituency
Malkajgiri BRS Candidate : మల్కాజ్‌గిరి అసెంబ్లీపై అధికార పార్టీ ఫోకస్ పెంచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) పార్టీకి రాజీనామా చేయడంతో ప్రత్యమ్నాయ నేత కోసం వేట ప్రారంభించింది. అంగ, అర్ధ బలాల్లో మైనంపల్లిని ఢీకొట్టే నేత ఎవరున్నారని ఆరా తీస్తోంది బీఆర్‌ఎస్. (BRS Party) మరోవైపు ఎమ్మెల్యేకు చెక్ చెప్పేలా ఆయనతో సన్నిహితులైన అధికారులపై బదిలీ వేటు వేస్తోంది. ఇటు పార్టీ.. అటు ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి.. ఆపరేషన్ మల్కాజిగిరిని ఉధృతం చేసింది అధికార పార్టీ.
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో మరోసారి పాగా వేసేలా అధికార పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషిస్తోంది బీఆర్‌ఎస్. పార్టీపై ధిక్కారం ప్రకటించిన ఎమ్మెల్యే హనుమంతరావును ఓడించేందుకు సరైన అభ్యర్థి ఎవరా? అంటూ ఆరా తీస్తోంది హైకమాండ్. స్థానిక నేతలు, ఉద్యమ కారులు తమకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా.. గెలుపు గుర్రాన్ని రంగంలోకి దించాలని భావిస్తోంది గులాబీ పార్టీ. మైనంపల్లి హనుమంతరావును తట్టుకునే అంగ, అర్ధబలంతో ఉన్న నేత కోసం కసరత్తు చేస్తోంది. మరోవైపు మైనంపల్లి అనుకూల అధికారులపై బదిలీ వేటు వేస్తూ ఆపరేషన్ మల్కాజ్‌గిరికి వేగంగా పావులు కదుపుతోంది బీఆర్ఎస్. కీలకమైన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖలలో మైనంపల్లితో సన్నిహితంగా ఉండే అధికారులను బదిలీ చేయడం హాట్‌టాపిక్ అవుతోంది.
నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న నేతల సంఖ్య భారీగానే ఉంది. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్న గులాబీ బాస్ కేసీఆర్ సరైన అభ్యర్థి కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్ విజయశాంతిరెడ్డి, (Chintala Vijayshanti Reddy) మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తొంది. ఓసి, బీసీ, మహిళ అభ్యర్థుల్లో క్షేత్ర స్థాయిలో అభ్యర్థుల బలా బలాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముగ్గురు నేతల్లో ఒక్కొక్కరికి ఒక్కో సానుకుల అంశం ఉంది. రెండు మూడు రోజుల క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… టికెట్ ఆశిస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారని చెబుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మర్రి రాజశేఖర్‌రెడ్డే మల్కాజిగిరి అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతోంది.
Also Read: వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్..! త్వరలో విలీనంపై అధికారిక ప్రకటన
గతంలో 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఐతే తన కుమారుడికి టికెట్ దక్కలేదనే ఆక్రోశంతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. మంత్రి హరీశ్‌రావ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి విమర్శలను తీవ్రంగా పరిగణించిన బీఆర్‌ఎస్.. ఆయనపై వేటు వేయాలని గతంలోనే నిర్ణయించింది. ఇంతలో ఆయనే పార్టీకి రాజీనామా చేయడంతో ఇప్పుడు కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇంకా అభ్యర్థులను ఖరారు చేయని గోషామహల్, నాంపల్లి, జనగామ, నర్సాపూర్ నియోజకవర్గాలతో కలిపి మల్కాజ్‌గిరి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై తుది చర్చలు జరుపుతోంది బీఆర్‌ఎస్.
Also Read: ఎన్నికల వేళ కేసీఆర్ ప్రభుత్వానికి కొత్త టెన్షన్.. ఎమ్మెల్యేలకు శాపంగా మారిన ఆ పథకం?
