Youtuber Vaishnavi : యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం.. ICUలో చికిత్స పొందుతున్న హరిబాబు
Youtuber Vaishnavi : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు
- Dharani Pilli
- Published On : March 22, 2026 / 02:22 PM IST
jagtial Youtuber vaishnavi case haribabu admitted in icu
Youtuber Vaishnavi Husband : తెలంగాణలో సంచలనం సృష్టించిన వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైష్ణవి భర్త హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైష్ణవి హత్య కేసులో ఇటీవలే పోలీసులు కోరుట్లలో హరిబాబుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న హరిబాబు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. చికిత్స నిమిత్తం జైలు సిబ్బంది వెంటనే అతడిని జగిత్యాల క్రిటికల్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హరిబాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కేసు ఏమిటంటే..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి (20)కి.. హరిబాబుతో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో మే 29, 2025న వీరిద్దరూ వెంకటాపూర్ శివారు ప్రాంతంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం హరిబాబు తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో వీరు వైష్ణవి ఇంటి వద్దనే ఉంటున్నారు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం హరిబాబు కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. వైష్ణవిని వదిలించుకుంటే మరింత కట్నం వచ్చే సంబంధం వస్తుందని హరిబాబు తల్లి, అన్నలు అతడిని ప్రలోభానికి గురి చేశారు. ఈ క్రమంలో మార్చి 16న అదనపు కట్నం కోసం హరిబాబు, వైష్ణవిల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే హరిబాబు గర్భవతి అనే జాలి కూడా లేకుండా.. వైష్ణవిని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
మంగళవారం ఉదయం గదిలో రక్తపు మడుగులో ఉన్న వైష్ణవిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈక్రమంలో పరారీలో ఉన్న హరిబాబును కోనరావుపేట ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైష్ణవి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
