AP Reliance : ఏపీలో మరో దిగ్గజ కంపెనీ భారీ పెట్టుబడి.. గూగుల్ ని మించి.. రూ.1.6 లక్షల కోట్లతో
AP Reliance : ఏపీలో మరో దిగ్గజ కంపెనీ ఏకంగా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.
- Dharani Pilli
- Updated on- April 28, 2026 / 12:23 PM IST
Andhra Pradesh Reliance invest nearly rs 1 6 lakh crore to set up Indias largest data centre cluster
AP Reliance : కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలైన గూగుల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాగా.. తాజాగా మరో దిగ్గజ కంపెనీ ఈ జాబితాలో చేరింది. ఏపీలో సుమారు 1.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ సంస్థ అంగీకరించింది.
ఏపీలోని విశాఖపట్నంలో 1.5 గిగావాట్ల (GW) సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ క్లస్టర్‌ను, అలాగే దానికి అవసరమైన సౌర విద్యుత్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్‌ను నిర్మించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1.6 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లకు పైగా) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే విశాఖలో గూగుల్ సంస్థ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలయన్స్ అంతకు మించి పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం గమనార్హం. ఈ క్రమంలో రిలయన్స్ డేటా సెంటర్ క్లస్టర్.. భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌గా అవతరించనుంది.
ముఖ్య అంశాలు:
- నిర్మాణ దశలు: భోగాపురం విమానాశ్రయం సమీపంలో మూడు దశల్లో గిగా-స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ క్లస్టర్‌ను రిలయన్స్ అభివృద్ధి చేయనుంది.
- మొదటి దశ: పోలిపల్లి గ్రామంలో 500 మెగావాట్ల (MW) డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీని వాణిజ్య ఉత్పత్తి అక్టోబర్ 2028 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
- రెండవ దశ: భోగాపురం ఈస్ట్ మరియు వెస్ట్ ప్రాంతాల్లో మరో 1 గిగావాట్ సామర్థ్యాన్ని 2030 నాటికి అభివృద్ధి చేస్తారు.
భూకేటాయింపులు: ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ సుమారు 935 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. దీనిలో డేటా సెంటర్ కోసం తొలి దశలో 300 ఎకరాలు.. రెండో దశలో 635 ఎకరాలను కేటాయించనున్నారు. దీంతో పాటు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కోసం 1 ఎకరం, డీశాలినేషన్ ప్లాంట్ (నీటి శుద్ధి కేంద్రం) కోసం 80 ఎకరాలు కేటాయించాల్సి ఉంది.
పెట్టుబడి వివరాలు:
ఏపీలో రిలయన్స్ పెట్టబోయే మొత్తం పెట్టుబడి రూ. 1.6 లక్షల కోట్లలో, డేటా సెంటర్ క్లస్టర్ కోసం రూ. 1.08 లక్షల కోట్లు, దానితో అనుసంధానించబడిన పునరుత్పాదక ఇంధన (Renewable Energy) ప్రాజెక్ట్ కోసం రూ. 51,300 కోట్లు కేటాయించింది. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ 9,000 MW-peak సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపింది.
ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు:
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత ఏడాది ప్రకటించినట్లుగా, రాష్ట్రం 6 GW హోస్టింగ్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ‘డేటా సెంటర్ పాలసీ 4.0’ కింద ప్రభుత్వం పెట్టుబడి వస్తువులపై 100 శాతం GST రీయింబర్స్మెంట్, యంత్రాలపై 10 శాతం మూలధన సబ్సిడీ వంటి రాయితీలను అందిస్తోంది.
