Raidurgam Land Auction : ఎకరం రూ.269 కోట్లు.. రాయదుర్గం భూముల వేలంలో రికార్డుల మోత.. వారంలో రూ.2,833.22 కోట్ల ఆదాయం

Raidurgam Land Auction : రాయదుర్గంలోని 5.38 ఎకరాల ప్లాట్ కోసం నిర్వహించిన ఈ-వేలంలో ఎకరానికి రూ.269 కోట్ల చొప్పున బిడ్ లభించింది. దీంతో ఆ ప్లాట్ మొత్తం విలువ సుమారు రూ.1,447.22 కోట్లకు చేరింది.

Hyderabad Raidurg Land Auction

Raidurgam Land Auction : హైదరాబాద్ నగరంలో భూముల ధరలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహిస్తున్న భూముల వేలం పాటల్లో భూమికి రికార్డు ధర పలికింది. రాయదుర్గంలో ప్రాంతంలోని అత్యంత విలువైన స్థలాల వేలంలో ఎకరం ఏకంగా రూ. 269 కోట్లకు బిడ్ దక్కింది.

Also Read : CNG Price Hike : సీఎన్‌జీ ధర పెంపు.. వాహనదారులపై మరో భారం.. కొత్త రేట్లు ఇవే! నేటి నుంచే అమల్లోకి..

రాయదుర్గంలోని 5.38 ఎకరాల ప్లాట్ కోసం నిర్వహించిన ఈ-వేలంలో ఎకరానికి రూ.269 కోట్ల చొప్పున బిడ్ లభించింది. దీంతో ఆ ప్లాట్ మొత్తం విలువ సుమారు రూ.1,447.22 కోట్లకు చేరింది. హైదరాబాద్ లోని కీలక ఐటీ ప్రాంతాల్లో భూములకు ఉన్న భారీ డిమాండ్ కు ఈ వేలం మరోసారి అద్ధం పట్టింది.

ఇదే క్రమంలో గత వారం నిర్వహించిన ప్లాట్‌-పీ1 వేలం కూడా అత్యంత భారీ ధరను నమోదు చేసింది. 5.25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్‌ ఎకరాకు రూ.264 కోట్ల ధర పలకగా.. మొత్తం రూ. 1,386 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో వేలం విలువలో 25శాతం మొత్తాన్ని తొలి దశ చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వం అందుకుంది.

తాజాగా నిర్వహించిన పీ2 వేలం ఫలితాన్ని, గత వారం పీ1 ఫలితాన్ని కలిపి చూస్తే.. కేవలం 10.63 ఎకరాల భూమి ద్వారా టీజీఐఐసీకి ఏకంగా రూ. 2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ రెండు వేలాల్లో ఎకరాకు సగటున రూ.266.53 కోట్ల ధర లభించడం విశేషం. ఐటీ, బిజినెస్ సంస్థలు రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌లో భూముల ధరలు ఇంత భారీగా పెరగడం రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ఉన్న భూములకు కంపెనీల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా భవిష్యత్తులోనూ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.