Chandrayaan 3: చంద్రుడిపై దిగిన తర్వాత రోవర్, ల్యాండర్ ఏం చేస్తాయో తెలుసా? ఆశ్చర్యపోతారు..

రోవర్ కదుతున్న సమయంలో చంద్రుడి ఉపరితలంపై భారత జాతీయ పతాకం, ఇస్రో లోగోల ముద్రలు పడతాయి.

Chandrayaan 3

Chandrayaan 3 – ISRO: జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి రష్యా పంపిన లూనా-25(Luna 25) రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో ఇప్పుడు ప్రపంచ దృష్టి భారత చంద్రయాన్-3పై పడింది. ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు విజయవంతంగా ఈ మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయవంతంగా ల్యాండ్ అయితే దేశానికి ఇదో అతి పెద్ద విజయం. ఇస్రో కీర్తి మరోసారి జగద్వితం అవుతుంది.

ఈ ప్రయోగం విజయవంతమైతే ల్యాండర్, రోవర్ అక్కడ ఏం చేస్తాయో తెలుసా? జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావడంలో ల్యాండర్ ప్రమేయం ఉంటుంది. గతంలో ల్యాండర్స్ అనేకసార్లు వరుసగా విఫలమయ్యాయి. చంద్రయాన్-2లో వాడిన విక్రమ్‌ ల్యాండర్‌ క్యాష్ ల్యాండింగ్ వల్ల కుప్పకూలింది.

ల్యాండర్స్ మిషన్లకు అదనంగా రోవర్స్ ను కలిపి ఇస్రో ప్రయోగం చేపడుతుంది. మొదట ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత అది ముందుకు కదలకుండా అక్కడే స్థిరంగా ఉంటుంది. చంద్రుడిపై తిరిగి పరిశోధనలకు సహకరించే ఛాన్స్ ఉండదు.

ఆ పరిసరాల్లో తిరగడానికి తగ్గట్లు రోవర్స్ ను రూపొందించి పంపారు. రోవర్స్ కు చక్రాలు ఉంటాయి. ల్యాండర్, రోవర్ ద్వారా చంద్రుడి ఉపరితలంపై శాస్త్రీయ ప్రయోగాలు చేసి, విశ్లేషిస్తారు. చంద్రయాన్-3లోని ప్రొపల్షన్ మాడ్యూల్ జీవిత కాలం 3-6 నెలల మధ్య ఉంటుంది.

ఇక ల్యాండర్, రోవర్ జీవిత కాలం ఒక లూనార్ డే(14 Earth days). ఈ లూనార్ డే కాలంలో రోవర్ ఆపరేషన్లను విశ్లేషించడానికి ఇస్రో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాగే, విక్రమ్ ల్యాండర్‌(3 పేలోడ్స్), రోవర్ (2 పేలోడ్స్) నుంచి వచ్చే టన్నుల కొద్దీ సమాచారాన్ని ఇస్రో విశ్లేషిస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉండే కఠిన పరిస్థితుల వల్ల ల్యాండింగ్ క్లిష్టతరం.

అయితే, అక్కడ సేఫ్ ల్యాండింగ్ చేస్తే చరిత్ర సృష్టించవచ్చు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు చేపట్టబోయే మిషన్లకు ఎంతగానో ఉపయోగకరం. అక్కడి ప్రాంతంలో మంచు రూపంలో ఉన్న నీరు భవిష్యత్తులోని మిషన్లకు ఇంధనం, ఆక్సిజన్, తాగునీరు అందించే అవకాశం ఉండొచ్చు.

ల్యాండర్, రోవర్ మరో లూనార్ డే ఉండాలంటే దక్షిణ ధ్రువంలోని లూనార్ నైట్లోని -238 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను అవి తట్టుకోవాల్సి ఉంటుంది. లూనార్ నైట్ అంటే చంద్రుడిపై సూర్యకాంతి పడని 14 రోజులు. ఒక లూనార్ డేలో రోవర్ కచ్చితంగా ఎంత దూరం ప్రయాణిస్తుందన్న విషయాన్ని చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

రోవర్, ల్యాండర్ ఇలా తిరుగుతాయి..

* రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగాక మొదట ల్యాండర్ లోని ఒకవైపు ప్యానెల్ తెరుచుకుంటుంది. ఆరు చక్రాలు ఉండే రోవర్‌ బయటకు రావడానికి వీలుగా ర్యాంప్ ఏర్పడుతుంది.

* నాలుగు గంటల తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది.

* రోవర్ ప్రజ్ఞాన్‌లో భారత జాతీయ పతాకం, అలాగే, ప్రజ్ఞాన్ చక్రాలపై ఇస్రో లోగోలను ముద్రించారు.

* ఒక్క క్షణానికి ఒక సెంటీమీటర్ వేగం చొప్పున అది ముందుకు వెళ్తూ అక్కడి పరిసరాలను నేవిగేషన్ కెమెరాల ద్వారా స్కాన్ చేస్తుంది.

* రోవర్ కదుతున్న సమయంలో చంద్రుడి ఉపరితలంపై భారత జాతీయ పతాకం, ఇస్రో లోగోల ముద్రలు పడతాయి.

* చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన డేటాను పంపడానికి రోవర్ లో పేలోడ్‌లతో కలిపి పరికరాలు ఉంటాయి.

* అక్కడి వాతావరణాన్ని, పరిస్థితులను పసిగట్టి ల్యాండర్ కు రోవర్ ఆ డేటా పంపుతుంది

* ఆ తర్వాత ల్యాండర్ అక్కడి అయాన్లు, ఎలక్ట్రాన్లు సాంద్రత వంటి అంశాలను గుర్తించి చంద్రుడిపై ఉన్న పరిస్థితులను శాస్త్రవేత్తలకు పంపుతుంది. ల్యాండింగ్ చేసిన ప్రాంతానికి చుట్టుపక్కన ఉన్న పరిస్థితులన్నింటినీ అది గుర్తిస్తుంది.

* దాదాపు రెండు వారాల పాటు ఇలా రోవర్, ల్యాండర్ తమ పరిశోధనలు కొనసాగిస్తాయి.

* రోవర్, ఇస్రోకి కమ్యూనికేషన్ నేరుగా ఉండదు. దీంతో గతంలో ప్రయోగించిన చంద్రయాన్-2లోని ఆర్బిటర్ ను కూడా కమ్యూనికేషన్ కోసం శాస్త్రవేత్తలు వాడుకునే అవకాశం ఉంది.

Chandrayaan 3 : ప్రతికూలంగా ఉంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్ వాయిదా.. ఇస్రో శాస్త్రవేత్త వెల్లడి

ట్రెండింగ్ వార్తలు