నిజామాబాద్ : ఇంకా ఎన్నికలే కాలేదు.. అప్పుడే పార్టీలకు ఝలక్ తగిలింది. అటు ఎలక్షన్ కమిషన్‌కు కూడా షాక్ కొట్టింది. కారణం నిజామాబాద్ లోక్‌సభలో దాఖలైన నామినేషన్లు. అవును.. ఏకంగా 245 నామినేషన్లు దాఖలు కావడంతో.. పోలింగ్ ఎలా నిర్వహించాలా అని అధికారులు కుస్తీ పడుతున్నారు. మరి నామినేషన్లు వేసిన వాళ్లంతా బరిలోనే ఉంటారా.. లేక ఉపసంహరించుకుంటారా..
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నామినేషన్లు ఎన్నికల కమిషన్‌కు షాక్‌ను ఇచ్చాయి. ఊహించని రూపంలో ఈ స్థానానికి ఏకంగా 245 నామినేషన్లు రావడంతో అక్కడ పోలింగ్ ఎలా నిర్వహించాలా అని ఈసీ బుర్రలు బద్దలు కొట్టుకుంటోంది. 203మంది తరఫున 245 సెట్ల నామినేషన్లు దాఖలైనా.. అందులో పన్నెండింటిని అధికారులు తిరస్కరించారు. అయినా కూడా 191మంది బరిలో ఉండటం కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది.
28వ తేదీ సాయంత్రం వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువుంది. దీంతో… ఆలోపు ఎవరైనా విత్ డ్రా చేసుకుంటారా లేదా… ఒకవేళ 191మంది పోటీలోనే ఉంటే వారికి ఏ గుర్తులు కేటాయించాలి.. పోలింగ్ ఎలా జరపాలి. బ్యాలెట్ పత్రాలు ఉపయోగించాలా.. అప్‌డేటెడ్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన ఈవీఎంలు ఉపయోగించాలా… అది సాధ్యమయ్యే పనేనా.. ఇవే విషయాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కసరత్తు చేస్తున్నాయి.
అసలు ఇన్ని నామినేషన్లు దాఖలయ్యేందుకు అసలు కారణం అన్నదాత ఆగ్రహం. కడుపు మండిన పసుపు, ఎర్రజొన్న పంట రైతులు భారీగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల చివరిరోజే 182 పత్రాలను సమర్పించారంటే… అన్నదాతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతోంది. గ్రామస్థులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి, డబ్బులు జమ చేసి నామినేషన్ వేయాల్సిన అభ్యర్థులను ఖరారు చేశారంటేనే పాలకుల తీరుపై ఎంత గుర్రుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న పంటలు ఎక్కువగా పండుతాయి. అయితే.. వాటికి సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో… ధర కోసం కొన్నేళ్ల నుంచి రైతులు పోరాటాలు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని, మద్దతు ధర పెంచుతామని నేతలు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోయారు. అటు పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామని సిట్టింగ్ ఎంపీ కవిత భరోసా ఇచ్చినా అది కూడా నెరవేరలేదు. తమ సమస్య పరిష్కరించాలంటూ అనేకసార్లు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో.. ప్రజాస్వామ్యయుతంగా బ్యాలెట్ పద్ధతిన పోరాటానికి దిగారు. రైతుల సమస్యలను జాతీయ స్థాయికి తీసుకువెళ్ళేందుకే అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. పాలకులపై తమ కసిని తీర్చుకోవడానికి పార్లమెంట్ ఎన్నికలను సద్వినియోగం చేసుకుంటున్నారు.