వరల్డ్ రికార్డ్ : కవలలకు జన్మనిచ్చిన 74ఏళ్ల బామ్మ

ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. బామ్మ అమ్మ అయ్యింది. మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే. 74 ఏళ్ల వయసులో ప్రసవించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది

  • Publish Date - September 5, 2019 / 05:38 AM IST

ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. బామ్మ అమ్మ అయ్యింది. మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే. 74 ఏళ్ల వయసులో ప్రసవించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది

వైద్య చరిత్రలో అద్భుతం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. బామ్మ అమ్మ అయ్యింది. మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే. 74 ఏళ్ల వయసులో ప్రసవించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది మంగాయమ్మ. కృతిమ గర్భధారణ పద్ధతిలో గర్భం దాల్చిన మంగాయమ్మ చివరికి తల్లి కావాలనే తన కోరిక తీర్చుకుంది. గురువారం(సెప్టెంబర్ 5, 2019) డాక్టర్లు సిజేరియన్ చేసి డెలీవరి చేశారు. తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఐవీఎఫ్ స్పెషాలిటీ నిపుణులు, గుంటూరు అహల్యా హాస్పిటల్ అధినేత డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు. 

తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో వివాహమైంది. అప్పటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. కానీ ఆమె కోరిక తీరలేదు. ప్రస్తుతం మంగాయమ్మకు 74 ఏళ్లు. అమ్మ అని పిలిపించుకోవాలని కలలు కంది. 2018లో చెన్నై వెళ్లి ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.

2018 నవంబర్ లో మంగాయమ్మ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా ఐవీఎఫ్ పద్ధతిలో గర్భధారణ చేయించారు. ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్య సేవలందించారు. ఆమెకు బీపీ, షుగర్ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా పెరిగింది. హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ పీవీ మనోహర్, జనరల్ మెడిసిన్ డాక్టర్ శనక్కాయల ఉదయ్ శంకర్ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మంగాయమ్మకు సిజేరియన్ చేసి పురుడుపోశారు. 74 ఏళ్ల వయసులో ప్రసవం, అందునా.. కవలలకు జననం ఇవ్వడం ప్రపంచ రికార్డ్ అని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ సక్సెస్ కావడం, కవలలకు జన్మనివ్వడంతో మంగాయమ్మ దంపతులు, డాక్టర్లు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల మంగాయమ్మకు తెలిసిన ఒకావిడ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయ్యింది. ఈ విషయం తెలిశాక మంగాయమ్మకు తానూ తల్లిని కావాలనుకుంది. గుంటూరులోని అహల్య నర్సింగ్‌ హోమ్‌ను సంప్రదించింది. వారు కృత్రిమ పద్దతుల్లో ఆమెకు గర్భధారణ చేయించారు. మంగాయమ్మకు బీపీ, షుగర్‌ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడం కలిసొచ్చింది. మంగాయమ్మ మెనోపాజ్‌ దశ దాటిపోయింది. దీంతో వేరే మహిళ నుంచి అండం, మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఐవీఎఫ్‌ పద్ధతిలో ప్రయత్నం చేస్తే మొదటి ప్రయత్నంలోనే విజయవంతమైంది. 2019 జనవరిలో మంగాయమ్మ గర్భం దాల్చింది. ఇప్పుడు నెలలు నిండటంతో గురువారం(సెప్టెంబర్ 5,2019) ఆపరేషన్‌ చేశారు. మొత్తానికి బామ్మ వయస్సులో మంగాయమ్మ అమ్మ అయ్యారు.