విషాదం : బాలుడి ప్రాణం తీసిన PUBG

  • Published By: madhu ,Published On : May 12, 2019 / 10:00 AM IST
విషాదం : బాలుడి ప్రాణం తీసిన PUBG

Updated On : May 12, 2019 / 10:00 AM IST

పాపులర్ ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ పబ్‌ జీ(PUBG) కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ మాయలో పడి ప్రాణాలను సైతం తీసుకోవడం కలవరపెడుతున్న విషయం. ఈ గేమ్ ఆడుతూ పరిసర ప్రాంతాలని కూడా మరిచిపోతున్నారు. యువతే కాదు..చిన్నారులు సైతం ఈ గేమ్ బారిన పడుతున్నారు. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పబ్జీ గేమ్‌ ఆడుతూ బాలుడు మృతి చెందిన సంఘటన అందరిని కలచివేసింది.

వేములవాడ పట్టణంలో బంధువులందరూ వివాహ సంబురాల్లో ఉండగా చరణ్‌ అనే తొమ్మిదేళ్ల బాలుడు పబ్జీ గేమ్‌ ఆడుతూ కారులో ఉండిపోయాడు. కారు డోర్‌ లాక్‌ పడటంతో ఊపిరాడక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. బాలుని కోసం వెతికిన తల్లిదండ్రులు చివరకు కారులో గుర్తించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పబ్జీగేమ్‌ ప్రాణాలు తీసిందని గుండెలవిసేలా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 

పబ్ జీ గేమ్ ని భారత్ లో నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ గేమ్ కి బానిసలైపోయి కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్నం కూడా తినడం మానేసి గేమ్ ఆడుతున్నారు. PUBG  గేమ్ కారణంగా చెడు ప్రభావానికి గురవుతున్నారని, ఇండియాలో వెంటనే ఈ గేమ్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. 

పబ్‌జీ… ఇది మిలిటరీ స్టైల్ షూటర్ బ్యాటిల్ రాయల్ గేమ్. ఈ గేమ్ లో 100 మంది ప్లేయర్స్‌ బ్యాటిల్ గ్రౌండ్‌లోకి దిగుతారు. ఒకరిపై మరొకరు యుద్ధం చేస్తుంటారు. చివరి వరకు ఈ గేమ్ లో ఎవరు ఉంటారో వాళ్లే విన్నర్. ఒకసారి ఈ గేమ్ ఆడితే చాలు.. మళ్లీ మళ్లీ ఆడాలనిపించే గేమ్. ఎంతటివారైన సరే పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అవ్వాల్సిందే. మొబైల్ వెర్షన్ రావడంతో ఇక ఈ గేమ్ కు పట్టాపగ్గాలు లేకుండా పోయింది. అందులోనూ స్మార్ట్ ఫోన్లలో 4జీ నెట్ వర్క్ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో యువత ఈ పబ్ జీ గేమ్ కు ఇంకా అడిక్ట్ అయిపోయారు.