తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నంలో ప్రమాదం చోటు చేసుకుంది. పాపికొండలు పర్యటనకు బయల్దేరిన 61మంది ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు. మత్స్యకారులు వెంటనే గమనించడంతో 14 మందిని కాపాడారు. రెస్యూ టీం సహాయంతో ప్రయాణికుల్లో మొత్తం 24 మందిని ప్రాణాలు కాపాడగలిగారు.
ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 12మంది, విశాఖ, రాజమండ్రికి చెందిన వారు 30మంది, వరంగల్ నుంచి 17మంది ఉన్నారు. కచ్చలూరు వద్ద ప్రవాహ వేగం ఎక్కువగా ఉందని బోటు వెనక్కితీసే ప్రయత్నం చేశారు. వెనుకగా ఉన్న రాయి గట్టిగా ఢీకొట్టడంతో పడవ ప్రమాదానికి గురైంది.
పడవ నీటిలో మునిగిపోవడంతో మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదు. ఇప్పటికే 7మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఇదే స్పాట్‌లో 2బోట్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. 1964లో ఉదయభాస్కర్ అనే బోటు ప్రమాదానికి గురై 60 మంది చనిపోయారు. ఆ తర్వాత ఝాన్సీరాణి అనే బోటు మునిగి 8మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాయల్ వశిష్ట ప్రమాదానికి గురైంది.