మందుబాబు హల్ చల్ : కత్తితో పోలీసుల్ని పరుగులు పెట్టించాడు 

  • Publish Date - November 19, 2019 / 05:22 AM IST

ఫుల్ గా మందు కొట్టాడు..ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ వ్యక్తి ఏకంగా పోలీసుల్నే చంపటానికి వెంటపడ్డాడు. కత్తి పట్టుకుని తరుముతూ..నానా హడావిడి చేశాడు. ఇష్టమొచ్చినట్లుగా వీరంగం ఆడాడు. విశాఖపట్నం జిల్లాలోని సిరిపురంలో సోమవారం (నవంబర్ 18) రాత్రి ఓ మందుబాబు వీరంగం స్థానికంగా కలకలం సృష్టించింది.

గుర్రం సాయి అనే వ్యక్తి మద్యం మత్తులో జోగుతూ..అడ్డమొచ్చినవారందరి మీదే కాదు ఏకంగా  పోలీసులపై కూడా దాడికి యత్నించాడు. కానిస్టేబుల్ సురేశ్, హోంగార్డ్ కుమార్ లపై కత్తితో దూసుకువెళ్లాడు. కత్తి పట్టుకుని చంపేస్తానంటూ బెదిరించాడు. 

ఓ ఫంక్షన్ హాల్ గేటుకు అడ్డంగా ఉన్న గుర్రంబండి తీయాలని సాయిని సెక్యూరిటీ గార్డులు అడిగారు. దీంతో పెళ్లి వేడుకలకు గుర్రం బండిని అద్దెకు ఇచ్చే సాయి రెచ్చిపోయాడు. నా ఇష్టం..నా ఇష్టమొచ్చినకాడ పెడతా..అడగటానికి మీరెవరూ అంటూ ఎదురు తిరిగాడు. కత్తితో వారిపై దాడికి యత్నించటంతో వారు హడలిపోయారు. కత్తి చేపపట్టి వారిని తరుముకుంటూ ఫంక్షన్ హాల్ లోకి ఎంటరయ్యాడు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి.

అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ గుర్రం సాయిని నియంత్రించటానికి యత్నించగా వారిపై కూడా కత్తితో దాడికి యత్నించాడు. కత్తితో కానిస్టేబుల్ ను తరుముకుంటూ ..నానా హడావిడి చేసి పోలీసులకు కాసేపు చెమటలు పట్టించాడు సాయి. ఈ వీరంగం కొంతసేపు కొనసాగింది. కానీ ఎట్టకేలకు మందుబాబు గుర్రం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  దీంతో ఫంక్షన్ హాల్లోని అతిథులు..అక్కడే ఉన్న మరికొందరు ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తుతోనే అతను అలా ప్రవర్తించినట్లుగా పోలీసులు గుర్తించారు.