చంద్రబాబుకు అధికారం లేదని ఎప్పుడూ చెప్పలేదు

  • Publish Date - April 28, 2019 / 03:15 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారాలు లేవు అని ఎప్పుడూ అనలేదని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. వివిధ శాఖలపై సమీక్షలు చేపట్టే అధికారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అధికారాలు లేవంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను అలా ఎప్పుడూ అనలేదని, ఆ అవసరం కూడా తనకు లేదని అన్నారు. చంద్రబాబు అంటే తనకు గౌరవం ఉందని వెల్లడించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి ప్రకారమే అధికారులు, ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని ద్వివేది సూచించారు. ఎవరు తమను ప్రశ్నించినా, ఇదే సమాధానం ఇస్తామని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సమీక్షలు నిర్వహించుకునే అధికారం చంద్రబాబుకు ఉందా? లేదా? అనేది తమ పరిధిలో లేదన్నారు.

రాష్ట్రంలో వివిధ కారణాలతో 5కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని ఈసీకి నివేదిక పంపామని, కౌంటింగ్‌లోపు ఎప్పుడైనా రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని ద్వివేదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 7దశల్లో పోలింగ్ పూర్తైన తరువాతే రీ పోలింగ్ నిర్వహిస్తామని ద్వివేదీ వెల్లడించారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ లోపు ఎప్పుడైనా రీపోలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.