కరోనా వైరస్(coronavirus) ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్(wuhan) లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతి(annem jyothi) గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా వైరస్(coronavirus) ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్(wuhan) లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతి(annem jyothi) గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. జ్యోతిని కూతురిగా భావించి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు స్పందించాలని.. ఆమెను వెంటనే భారత్ కు తీసుకురావాలని కోరారు. తమ బాధలను నాయకులకు విన్నవించేందుకే ఢిల్లీకి వచ్చామని జ్యోతి తల్లి తెలిపింది. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్యంగానే ఉందని, వూహాన్ లో భయంతో బతుకుతోందని ఆమె తెలిపారు. జ్యోతికి తినడానికి తిండి కూడా లేదని వాపోయారు.
ఇటీవలే సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన జ్యోతి ట్రైనింగ్ కోసం చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లింది. అదే సమయంలో కరోనా వైరస్ విజృంభించడంతో ఆమె అక్కడ చిక్కుకుపోయింది. చైనా నుంచి భారతీయులను తరలించే సమయంలో.. జ్యోతికి సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువగా జ్వరం ఉంది. కరోనా ఉందేమో అనే అనుమానంతో ఆమెను అధికారులు అక్కడే వదిలేశారు. దీంతో జ్యోతి చైనాలో చిక్కుకుపోయింది. జ్యోతిని భారత్ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ఈ క్రమంలో జ్యోతి తల్లి ప్రమీల, కాబోయే భర్త అమర్ నాథ్.. ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రంలోని పెద్దలను కలుస్తున్నారు. జ్యోతిని భారత్ తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు వారికి విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ను కలుస్తామని చెప్పారు.
జ్యోతిని స్వదేశానికి రప్పించేందుకు ఎంపీ బ్రహ్మనందరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 14న జ్యోతి వివాహం ఉంది. దీంతో త్వరగా తమ కూతురిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. భారత్, చైనా మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపేయడంతో తెలుగమ్మాయి జ్యోతి స్వదేశానికి రాలేని స్థితి నెలకొంది. వారం రోజుల క్రితం జ్యోతికి జ‍్వరం కారణంగా ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో అధికారులు ఇండియాకు తీసుకురాలేకపోయిన సంగతి తెలిసిందే. కాగా, తనకు కరోనా వైరస్ లేదని, వెంటనే భారత్ కు తీసుకెళ్లాలని జ్యోతి కోరింది.