స్టూడెంట్స్ మధ్య క్రికెట్ బెట్టింగ్ చిచ్చు : డబ్బుల విషయంలో కొట్లాట

  • Publish Date - October 2, 2019 / 05:52 AM IST

స్నేహితుల్లా ఉండే విద్యార్థుల మధ్య క్రికెట్ చిచ్చు పెట్టింది. క్రికెట్ బెట్టింగ్ పశ్చిమగోదావరి జిల్లా పెద తాడేపల్లిలో విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసింది. పెదతాడేపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ కొట్టుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ లో బాకీ పడిన డబ్బులు విషయంలో తలెత్తిన వివాదం.. కొట్లాటకు దారి తీసింది. ఈ దాడిలో సదరు స్టూడెంట్ కు గాయాలయ్యాయి. చుట్టూ నిలబడి చూస్తున్న విద్యార్థులు చూస్తుండగానే దాడికి పాల్పడ్డాడు. ఎవ్వరూ అడ్డుకోలేదు.  

2019, సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ లో భాగంగా రూ.30వేలు బాకీ పడ్డాడు. ఆ డబ్బులు తనకు ఇవ్వలేదని అడుగుతుంటే మాటలు దాటవేస్తు కాలం వెల్లబుచ్చుతున్నాడనీ ఓ విద్యార్థి మరో విద్యార్థిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. అదంతా వీడియో తీయించాడు.

తాను రూ30వేలు ఇవ్వలేననీ.. కొంత మాత్రమే ఇచ్చుకోగలనని చెప్పి.. ఆ డబ్బుని కూడా ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత.. మిగతా డబ్బు కూడా ఇవ్వాలని  వేధింపులకు గురి చేశాడు. ఈ  క్రమంలో బాధితుడికి అతని పేరెంట్స్ రూ.20 వేలు పంపించగా.. వాటిని కూడా అతడి నుంచి బలవంతంగా లాక్కుడున్నాడు. అక్కడితో ఊరుకోకుండా ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తున్నాడు. ఇదేమని ప్రశ్నించిన ఆ స్టూడెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాత్రూమ్ లో పడేసి కొట్టాడు.

ఈ వేధింపులు భరించలేక బాధితుడు తల్లిదండ్రులకు చెప్పాడు. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఏమాత్రం స్పదించలేదు.