నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. టిక్ టాక్ వీడియో తీస్తూ మరో యువకుడు మృతి చెందాడు.
సెల్ఫీ, టిక్ టాక్ వీడియోల కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో వీడియోలు తీస్తూ మృత్యువాత పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. టిక్ టాక్ వీడియో తీస్తూ మరో యువకుడు మృతి చెందాడు. భీంగల్ మండలం గొనుగుప్పుల గ్రామంలోని కప్పలవాగు చెక్ డ్యామ్ లో ఇద్దరు స్నేహితులతో కలిసి టిక్ టాక్ చేస్తుండగా దినేశ్ అనే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం అయింది. పోలీసులు రెండు రోజులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు.
గొనుగుప్పుల గ్రామంలో ఇంద్రపురం దినేశ్ (22) తన ఇద్దరు స్నేహితులు గంగాజలం, మనోజ్ గౌడ్ తో కలిసి శుక్రవారం (సెప్టెంబర్ 20, 2019) సాయంత్రం చెక్ డ్యామ్ కు వెళ్లారు. ముగ్గురూ వరద నీటిలోకి దిగి టిక్ టాక్ వీడియోలు తీస్తున్నారు. అనంతరం వారు చెక్ డ్యామ్ దగ్గర చేపలు కూడా పట్టారు. ఈక్రమంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరుగడంతో ముగ్గురు స్నేహితులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
ఈత వచ్చిన మనోజ్ గౌడ్..దినేశ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా..తనకు ఈత వస్తుందని, గంగాజలంను కాపాడాలని సూచించాడు. ఒడ్డున చేపలు పడుతున్న వారు గమనించి మనోజ్ గౌడ్, గంగాజలంను కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా దినేశ్ మాత్రం గల్లంతయ్యాడు.
రెవెన్యూ అధికారులు, రిస్క్యూ టీమ్, పోలీసులు చెక్ డ్యామ్ ప్రాంతంలో దినేశ్ కోసం తీవ్రంగా గాలించారు. ఆదివారం (సెప్టెంబర్ 22, 2019) 8 గంటలకు మృతదేహం లభ్యం అయింది. దినేశ్ మృతదేహాన్ని చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. అతడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గతంలో రిస్కి వీడియోలు తీస్తూ చనిపోయిన సంఘటనలు, ప్రాణాలను రిస్క్ పెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. చాలా మంది యువత లైక్ లు, షేర్ ల కోసం ఇలా చేయడం కరెక్టు కాదంటూ అధికారులు చెబుతున్నా ఇలాంటి ఘటనలు అధికమవుతున్నాయి.