ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా చెలామణి అవుతారని వెల్లడించారు. దాదాపు 52 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దీనికోసమే ఈ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం 3 వేల 600 కోట్ల రూపాయలను ఉద్యోగుల తరపున ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపారు. చిరునవ్వుతో ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పారు. ప్రతి ఉద్యోగి కూడా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ఆర్టీసీ గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కోసం ప్రజారవాణా శాఖను కూడా తీసుకొచ్చేందుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే జగన్ సీఎం బాధ్యతలు చేపట్టాక విలీనం దిశగా అడుగులు వేశారు.
కానీ ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉండటంతో ఆర్టీసీని విలీనం చేయడం కుదరలేదు. దీంతో ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవలే కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించింది. దానికి అనుగుణంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ చట్టం చేసింది.