ఏపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందజేయనుంది. కొత్త ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు అందజేయనుంది. కొత్త ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం (సెప్టెంబర్ 5, 2019) నుంచి అమల్లోకి రానుంది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం (సెప్టెంబర్ 4, 201) జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త ఇసుక విధానంపై చర్చించి ఆమోదం తెలిపారు. అనంతరం సమాచార, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.
రాష్ట్రంలో ఇసుక తవ్వకం, రవాణాను ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) చేపట్టనుంది. ఇసుకపై పర్యావరణ హితమైన కొత్త విధానం అమల్లోకి రానుంది. ప్రజలకు సరసమైన ధరకు ఇసుక లభించేలా కొత్త విధానాన్ని రూపొందించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే భారీగా ధర తగ్గిస్తూ, పారదర్శకంగా నేరుగా వినియోగదారులకు ఇసుక చేరవేయనున్నారు. బుధవారం (సెప్టెంబర్ 4, 2019) నాటికి 13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్టోబరు నాటికి వీటిని 70 నుంచి 80 వరకు పెంచనున్నారు. క్రమంగా మరిన్ని స్టాక్ పాయింట్లను పెంచనున్నారు. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్ పాయింట్ దగ్గర టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించారు. అక్కడి నుంచి రవాణా ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున రవాణా ఖర్చును నిర్ధారించారు.
10 కిలోమీటర్ల లోపు వరకు ట్రాక్టర్ల ద్వారా రవాణా ఖర్చు రూ.500గా నిర్ణయించారు. పట్టా భూముల్లో రైతుల అనుమతితో ఇసుక తవ్వకాల బాధ్యతను ఏపీఎండీసీకి అప్పగించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు క్యూబిక్ మీటరుకు రూ.60 చొప్పున ఏపీఎండీసీ రైతులకు చెల్లించనుంది. లోడింగ్, తవ్వకాల రూపంలో రైతులపై ఎలాంటి భారం ఉండదు. దీన్ని ఏపీఎండీసీనే భరిస్తుంది. 82 చోట్ల పట్టా భూములను ఎపీఎండీసీ గుర్తించింది. 100 రీచ్‌లను సిద్ధం చేసింది. 31 చోట్ల డీ సిల్టేషన్ చేపట్టనుంది. ఇసుక రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్ తప్పనిసరి. రీచ్ నుంచి స్టాక్ పాయింట్‌కు, స్టాక్ పాయింట్ నుంచి వినియోగదారుడికి చేరే వరకు వాహనాల్లో జీపీఎస్ ఉంటుంది. అనుమతి లేని వాహనాల్లో ఇసుక రవాణా చేయకూడదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాపై నిషేధం విధించారు.
కొత్త ఇసుక విధానంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆంధ్రా బ్యాంకు పేరును యథాతథంగా కొనసాగించేలా ప్రధానిని కోరాలని, ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని, శ్రీరామనవమి నుంచి పెంచిన వైఎస్సార్ పెళ్లి కానుకను అమలు చేయాలని, జాతీయ పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read : బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటన : 23కు చేరిన మృతుల సంఖ్య