ఏపీ కేబినెట్‌ భేటీ : ఇసుక పాలసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

ఇసుక కొరత దుమారాన్ని రేపుతున్న సమయంలో ఏపీ కేబినెట్‌ భేటీ కాబోతోంది. ఇసుక పాలసీ, ఇసుక కొరతపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • Publish Date - October 30, 2019 / 05:23 AM IST

ఇసుక కొరత దుమారాన్ని రేపుతున్న సమయంలో ఏపీ కేబినెట్‌ భేటీ కాబోతోంది. ఇసుక పాలసీ, ఇసుక కొరతపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇసుక కొరత దుమారాన్ని రేపుతున్న సమయంలో ఏపీ కేబినెట్‌ భేటీ కాబోతోంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన బుధవారం (అక్టోబర్ 30, 2019) 11గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీలో… ఇసుక పాలసీ, ఇసుక కొరతపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు.. 30 అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. కొద్ది రోజులుగా ఇసుక లభ్యం కాకపోవడంతో భవన నిర్మాణ కార్మికుల వారి రోజువారి జీవనోపాధికి ఇబ్బందిగా మారింది. దీంతో… కార్మికులు ఆందోళన పట్టారు. దీనికి తోడు విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో… ఇవాళ్టి కేబినెట్ భేటీలో… ఇసుక కొరతను అధిగమించేందుకు తీసుకోవాల్సిన విషయాలపై చర్చించే అవకాశం ఉంది. రోబో ఇసుకను ప్రోత్సహించేందుకు క్రషర్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు రానుంది.

హజ్‌, జెరూసలేం యాత్రికులకు ఆర్ధికసాయం పెంపుపై చర్చించనున్న కేబినెట్ వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో వలంటీర్ల వ్యవస్థ ఒకటి. ప్రజల వద్దకే పథకాలు అనే ఆలోచనతో జగన్ గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు బీజం వేశారు. ఇప్పటికే ఓసారి వలంటీర్ల నియామకం జరిగినా, వివిధ కారణాలతో కొందరు తప్పుకున్నారు. ఇప్పుడా ఖాళీలను భర్తీ చేసేందుకు మరోసారి నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఖాళీగా ఉన్న 19 వేల 170 వలంటీర్ పోస్టుల భర్తీపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. జనవరిలో అమ్మఒడి పథకం ప్రారంభం కానుంది. దీన్ని జగనన్న అమ్మఒడి పథకంగా పేరు మార్చడంతో పాటు మార్గదర్శకాలు ఖరారు చేస్తారు. అలాగే… రైతు భరోసా రెండో విడత నిధులు, భూ కేటాయింపులకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.

పేదలు ఆక్రమించిన, ఎలాంటి అభ్యంతరాలూ లేని 100గజాలలోపు ఇళ్ల స్థలాలను నామమాత్రపు రుసుముకే రిజిస్ట్రేషన్‌ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు వాటిని రెండేళ్ల తర్వాత విక్రయించుకునేలా 388 జీవోకు సవరణ ప్రతిపాదనపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. హజ్‌యాత్ర, జెరూసలేం యాత్రకు ఇచ్చే ఆర్థికసాయాన్ని పెంచాలన్న ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నాయి. దేవాలయాల్లో ట్రస్ట్‌బోర్డ్‌ సభ్యుల నియామకంపై ప్రభుత్వానికి అధికారాలు కట్టబెట్టే చట్ట సవరణపైనా కేబినెట్‌లో చర్చ జరగనుంది. బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ ఏర్పాటుతో పాటు మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్‌ ఏర్పాటుపైనా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అధికారంలోకి వచ్చాక నవరత్నాల అమలుపైనే జగన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. వాటి అమలుపై కేబినెట్‌లో చర్చ జరగనుంది.