ఏపీ కేబినెట్‌ : అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రధాన చర్చ

ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణే ప్రధానాంశంగా బుధవారం (ఫిబ్రవరి 12, 202) ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్‌ చర్చించబోతున్నారు.

  • Publish Date - February 12, 2020 / 01:31 AM IST

ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణే ప్రధానాంశంగా బుధవారం (ఫిబ్రవరి 12, 202) ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్‌ చర్చించబోతున్నారు.

ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణే ప్రధానాంశంగా బుధవారం (ఫిబ్రవరి 12, 202) ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్‌ చర్చించబోతున్నారు. అలాగే పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఉదయం పదిన్నరకు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా మార్చాలనుకుంటున్న విశాఖకు సెక్రటేరియట్‌, ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపైనే ప్రధానంగా చర్చించనుంది. దీనిపై రాజధాని రైతులు హైకోర్టులో వేసిన కేసులపై మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్‌ డిస్కస్‌ చేస్తారు. 

ప్రభుత్వ నిర్ణయాలకు చట్టపరమైన చిక్కలు రాకుండా జాగ్రత్తలు
ప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలపై కొందరు హైకోర్టులో పిటిషన్లు వేస్తుండటంతో… ఇకపై చట్టపరమైన చిక్కలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయాలన్న నిర్ణయంపైనా కోర్టుకు వెళ్లడంపై జగన్‌ తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రభుత్వం నియమించుకున్న అడ్వకేట్‌పై కూడా కోర్టును ఆశ్రయించడంతో… ఇకపై న్యాయపరమైన సమస్యలు ఎదురైతే ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కేబినెట్‌లో చర్చిస్తారు.

పెన్షన్ల పునరుద్ధరణపై సమీక్ష 
ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైఎస్ఆర్ పింఛన్ల పంపిణీపై ప్రతిపక్షాల విమర్శల్ని ప్రభుత్వం సీరియస్‌గానే తీసుకుంది. పింఛన్లు కోల్పోయిన అర్హులకు పెన్షన్ల పునరుద్ధరణపై కేబినెట్‌లో సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఫిబ్రవరి 15 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, బియ్యం కార్డుల రీ వెరిఫికేషన్‌పైనా చర్చించనున్నారు. సీఆర్డీఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుల విషయంలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై టీడీపీ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పడంతో… ఈ వ్యవహారంలో భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించే అవకాశముంది. అలాగే వచ్చే నెల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో… శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో కేటాయించాల్సిన నిధులపై మంత్రివర్గం చర్చిస్తుంది.

ఎర్రచందనం కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక కోర్టు  
మరోవైపు ఎర్రచందనం కేసుల విచారణ కోసం తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. సీపీఎస్ రద్దు కోసం గతంలో నిర్వహించిన ర్యాలీలపై నమోదైన కేసుల్ని కొట్టేసే అంశంపైనా ఓ నిర్ణయానికి రానుంది. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదించే ప్రతిపాదనపైనా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగ్‌లు, మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇచ్చేందుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. నూతనంగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కార్పొరేషన్‌ ద్వారా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇవాళ ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ 
మరోవైపు ఇవాళ సాయంత్రంలో ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ప్రధానితో చర్చించాల్సిన అంశాలపైనా కేబినెట్‌ సమావేశంలో డిస్కస్‌ చేయనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు, రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చేయాల్సిన సాయంపై తయారు చేయాల్సిన నోట్‌ గురించి చర్చిస్తారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేబినెట్‌ సమావేశం గంటన్నరలోనే పూర్తి కానుంది.