అమరావతి : జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల మృతి చెందిన విషయం తెలిసిందే. పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించారు. ఉగ్రదాడి ఘటన బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జాతిని దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. ఈ సమయంలో జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
వీర జవాన్ల కుటుంబాలకు నైతిక స్థైర్యం అందివ్వడం మన కర్తవ్యమన్నారు. సైనికుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. ఏపీ ప్రజలు పుల్వామా ఘటనకు నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఒక్కొక్క వీర జవాన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని ఏపీ ప్రభుత్వం తరపున ప్రకటిస్తున్నామని చెప్పారు.