విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితుడు శివప్రసాద్‌తో ఆమె వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, ఆత్మీయులు, రాజకీయ నేతలు, ఇతరుల సమక్షంలో
శుక్రవారం (అక్టోబర్ 18, 2019) తెల్లవారుజామున 3:15 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. స్వగ్రామం శరభన్నపాలెంలో మేళతాళాలతో విద్యుత్ దీపాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది.
అయితే చిన్న వయస్సులోనే అత్యున్నత చట్టసభకు ఎన్నికై అందరి దృష్టినీ ఆకర్షించిన గొడ్డేటి మాధవి పెళ్లికి బంధుమిత్రులతో పాటు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పెళ్లిబాజాల మధ్య బంధుమిత్రులు సంతోషంగా డ్యాన్స్ లు చేశారు.
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు అందరూ కలిసి ఎంపీ మాధవిని ఆశీర్వదించారు. శివప్రసాద్ బీటెక్, ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ కాలేజ్ కరస్పాండెట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు.