ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ల బదిలీల వ్యవహారంలో ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ ల బదిలీల వ్యవహారంలో ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. కోర్టులో ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున నుంచి ఏజీ శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 28 ఏ ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల పరిధిలోకి రారు కాబట్టి ఆయన్ను బదిలీ చేసే అవకాశం, అధికారం ఎన్నికల కమిషన్ కు లేదని వాదన వినిపించారు.
అయితే ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి, వైసీపీ తరపు లాయర్లు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. ఎన్నికల కమిషన్ కు అన్ని అధికారులున్నాయని తెలిపారు. సీఈసీ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ప్రభుత్వానికి లేదని ఈసీ తరపు లాయర్ అన్నారు. ఫిర్యాదులు వచ్చినందునే అధికారులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదనలు వినిపించారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ లపై ఈసీ చర్యలు తీసుకుంది. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంపై వేటు వేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ వారిని ఆదేశించింది. ఐపీఎస్ అధికారుల బదిలీలపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికారుల బదిలీపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారుల బదిలీ సరికాదని.. ఇదంతా ఒక కుట్ర పూరితంగా జరుగుతోందని ఆరోపిస్తున్నారు.