కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ సోమవారం (అక్టోబర్ 7, 2019) నుంచి 17వ తేదీ వరకు జరుగుతోంది. ఇందులో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 46 వేలకు పైగా యువకులు పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ ర్యాలీ ద్వారా సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ ఫార్మా, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సోమవారం టెక్నికల్ గ్రేడ్ విభాగంలో జరిగిన ర్యాలీ కోసం 3448 మంది యువకులు దరఖాస్తులు చేసుకోగా సుమారు 3 వేల మంది వరకు పాల్గొన్నారు.
యువకులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరిశీలించిన తర్వాత 1.6 మీటర్ల రన్నింగ్, ఇతర శారీరక దృఢత్వ పరీక్షలు, ఎత్తు, బరువు, ఛాతీ, ఇతరత్రా పరీక్షల్లో అర్హత సాధించిన వారిని వైద్య పరీక్షల కోసం ఎంపిక చేశారు. అయితే ర్యాలీకి ముందు రోజు నగరంలో వర్షం పడడంతో రన్నింగ్ ట్రాక్ పూర్తిగా బురదతో నిండిపోయింది. అయినప్పటికీ యువకులు బురదలో సైతం పరుగెత్తి పరుగు పందెంలో అర్హత సాధించారు.
ఇక ర్యాలీ జరిగే 10 రోజులు యువకుల కోసం మెడికల్ టీం, 108 వాహనం అందుబాటులో ఉంచారు. అంతేకాదు ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులకు త్రాగునీటి వసతి, టెంపరరీ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు.