ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం రూ.10వేలు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కాగా దరఖాస్తు
ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం రూ.10వేలు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కాగా దరఖాస్తు తేదీలో మార్పు జరిగింది. సెప్టెంబర్ 12 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 10 నుంచే దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ కావాల్సి ఉంది. మార్గదర్శకాలు మరింత సరళతరం చెయ్యాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విసుగు తెప్పించే విధంగా నిబంధనలు ఉండకూడదని చెప్పారు. దీంతో రవాణశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. గైడ్ లైన్స్ మార్చే పనిని ముమ్మరం చేశారు.
తేదీ మార్పు పై రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి తిరుమల కృష్ణబాబు స్పందించారు. ”సెప్టెంబర్ 10 నుంచే ఆన్ లైన్ దరఖాస్తులు పెట్టాలని అనుకున్నాము. మార్గదర్శకాలు సరళతరం చెయ్యాలని సీఎం జగన్ ఆదేశించారు. లేనిపోని నిబంధనలతో దరఖాస్తుని నిరాకరించే విధంగా, విసుగు తెప్పించే విధంగా ఉండకూడదని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గైడ్ లైన్స్ ను సులభతరం చేస్తున్నాం. కొత్త మార్గదర్శకాలను మీడియా ద్వారా వెల్లడిస్తాం. సెప్టెంబర్ 12 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతాం. ఈ విషయాన్ని లబిద్దారులు గుర్తించగలరు” అని కృష్ణబాబు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారే పథకానికి అర్హులు అని అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే.
2019 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో 6.63 లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నట్లు అంచనా. ఇందులో సొంతంగా నడుపుకుంటున్న వారివి 3.97 లక్షలకు పైగా ఉన్నట్లు రవాణశాఖ అంచనా వేస్తోంది. దరఖాస్తులను స్క్రూటినీ చేసి గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం రూ.10 వేల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అందుకు సంబంధించిన రశీదుల్ని లబ్ధిదారులకు గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారు.