అనంతపురం : టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాని మోడీనే బూతులు తిట్టారు. మోడీకి సిగ్గూ, శరం ఉంటే.. నిజంగా మగాడే అయితే నేను తిట్టే తిట్లకు సముద్రంలో దూకి చావాలి అని బాలయ్య అన్నారు. ఇప్పుడే కాదు, మోడీని ఇంతకుముందు కూడా తీవ్రస్థాయిలో తిట్టానని, అయినా ఆయనకు సిగ్గూ, శరంలేవని బాలయ్య చెప్పారు. మోడీని నేను తిట్టినట్టు దేశంలో ఎవరూ తిట్టి ఉండరు అని గొప్పగా చెప్పుకున్నారు.
గతంలో ఓసారి బాలకృష్ణ హిందీలో మోడీపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ప్రధానిని తిట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్ పైనా బాలయ్య విమర్శలు చేశారు. కేసీఆర్, జగన్ లతో కలిసి రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి మోడీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వారు ముగ్గురూ కలిసి వచ్చినా తననేమీ చేయలేరని అన్నారు. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయంటే అది చంద్రబాబు చలవేనని బాలయ్య చెప్పారు. రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని.. విశాఖకు వెళ్లి ప్రచారం చేస్తానని బాలకృష్ణ వెల్లడించారు. హిందూపురంలోని శ్రీకంఠపురం, లక్ష్మీపురంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బాలకృష్ణ తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. దేశ ప్రధానిని అంత మాట అంటారా అని బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాలయ్య మాటలను ఖండించారు. బాలయ్యపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ తీరు వివాదాలకు దారితీసింది. మొన్న.. వీడియో జర్నలిస్టుని బూతులు తిట్టారు. అది మరువక ముందే.. పీక కోస్తా అని టీడీపీ కార్యకర్తకే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రధానిని దూషించి కలకలం రేపారు.