ఏపీలో ఈ సిగరెట్లపై నిషేధం విధించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరికలు చేశారు. ఏపీలో ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణ, అమ్మకంపై నిషేధం
ఏపీలో ఈ సిగరెట్లపై నిషేధం విధించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరికలు చేశారు. ఏపీలో ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణ, అమ్మకంపై నిషేధం విధించినట్టు తెలిపారు. ఆన్ లైన్ లో అమ్మకం, ప్రకటనలపైనా బ్యాన్ విధించారు. రూల్స్ అతిక్రమిస్తే ఏడాది జైలు లేదా రూ.2లక్షలు జరిమానా విధిస్తామన్నారు. రెండోసారి అదే నేరం చేస్తే మూడేళ్లు జైలు, రూ.5లక్షలు జరిమానా విధిస్తామన్నారు. ఈ-సిగరెట్లు నిల్వ చేస్తే 6 నెలలు జైలు శిక్ష లేదా రూ.50వేలు ఫైన్.. లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకం, ఉత్పత్తి, తయారీ, దిగుమతి, అమ్మకంపై బ్యాన్ విధిస్తూ కేంద్రం ప్రభుత్వం సెప్టెంబర్ 18, 2019 ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ-సిగరెట్లను వినియోగించడం, విక్రయించడం, కలిగి ఉండటం, రవాణా చేయడాన్ని తీవ్రమైన నేరాలుగా కేంద్రం పరిగణించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం, ఎస్సైలకు ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిఘాతో పాటు స్వాధీనం చేసుకునే అధికారం కల్పించింది. 1940 డ్రగ్స్ కాస్మటిక్స్ చట్టం ద్వారా లైసెన్స్ పొందిన ఉత్పత్తులను మినహాయించి.. అన్ని రకాల ఎలక్ట్రానిక్ నికోటిన్ ఉత్పత్తులు, ఈ-హుక్కా ఏ పరిమాణం, రూపం, ఆకారాన్ని కలిగి ఉన్నా ఎలక్ట్రానిక్ సిగరెట్లుగా పరిగణించబడతాయి.
ఇకపై ఈ-సిగరెట్లపై నిఘా కొనసాగుతుందని, చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వ్యాపారులు, వ్యక్తులు… ఇలా ఎవరి దగ్గరైనా ఈ-సిగరెట్లు ఉంటే తక్షణం వాటిని స్థానిక పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని పోలీసులు సూచించారు.