నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు.. సొంత గ్రామానికి చెందిన ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. గ్రామస్తులు ఎవరూ ఆయనతో మాట్లాడొద్దని పంచాయతీ
నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు.. సొంత గ్రామానికి చెందిన ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. గ్రామస్తులు ఎవరూ ఆయనతో మాట్లాడొద్దని పంచాయతీ పెద్దలు ఆదేశించారు. కాదని.. మాట్లాడితే.. రూ.10వేలు ఫైన్ చెల్లించాలని తీర్మానం చేశారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామ పంచాయతీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్సీ బీదతో నేరుగా మాట్లాడితే రూ.10వేలు.. ఫోన్ లో మాట్లాడితే రూ.3వేల జరిమానా చెల్లించాలని కట్టుబాటు విధించారు.
దీనికి కారణం ఎమ్మెల్సీ బీద.. గ్రామాన్ని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే. అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామాన్ని దరిద్రమైన ఊరు అంటూ బీద రవిచంద్ర అన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు… ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బీద రవిచంద్రతో ఎవరూ మాట్లాడకూడదని పంచాయతీలో సంచలన నిర్ణయానికి వచ్చారు. పంచాయతీ తీసుకున్న నిర్ణయాన్ని గ్రామస్తులు ఎవరైనా అతిక్రమిస్తే… రూ.10వేలు జరిమానా విధిస్తామన్నారు.
శివాలయ పునర్ నిర్మాణంలో భాగంగా మంగళ, బుధ, గురువారాలు ప్రత్యేక కార్యక్రమాలను తలపెట్టారు గ్రామస్తులు. తొలిరోజు స్థానిక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు. గ్రామం సమీపంలోని ఇస్కపల్లిపాలేనికి చెందిన మత్స్యకారులూ తరలివచ్చారు. ఇస్కపల్లి గ్రామంలో కాశీ విశ్వేశ్వర ఆలయ జీర్ణోదరణ, కుంబాభిషేకం సమయంలో వివాదం నెలకొంది.
ఆలయ పూజలకు సముద్ర జలాల కోసం వెళ్లిన సందర్భంలో వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇలాంటి దరిద్రపు ఊరు జిల్లాలో లేదు’.. అంటూ రవిచంద్ర తన స్వగ్రామం ఇస్కపల్లిని ఉద్దేశించి అన్నారు. అంతేకాక.. మత్స్యకార మహిళల దగ్గర మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారట. దీంతో మహిళలు మండిపడ్డారు. ‘మేం దరిద్రపు వాళ్లమా, 30 ఏళ్లుగా మా గ్రామాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయంగా రాష్ట్ర స్థాయికి ఎదిగి, మమ్మల్ని దూషిస్తావా’.. అంటూ ఆగ్రహించారు. కలశాల్లో సముద్రపు నీరు ఇవ్వబోమని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అనంతరం ఇస్కపల్లిపాలెంలో మత్స్యకారులంతా సమావేశమయ్యారు. బీద రవిచంద్రతో నేరుగా మాట్లాడితే రూ.10వేలు.., ఫోన్‌లో మాట్లాడితే రూ.3వేలు జరిమానా చెల్లించాలని మత్స్యకారులు కట్టుబాటు పెట్టుకున్నారు.
ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పందించారు. గ్రామంలో జరిగిన వాస్తవ పరిస్థితి వేరని… బయట ప్రచారంలో ఉన్నది వేరని చెప్పారు. తాను గ్రామాన్ని అలా అనలేదని… కేవలం గ్రామంలో అపరిశుభ్రత పరిస్థితులపైనే మాట్లాడానని వివరించారు. తాను చేసిన వ్యాఖ్యలు గ్రామం గురించి కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో మాట్లాడుతానని బీద రవిచంద్ర అన్నారు.