రాయల్ వశిష్ట బోటు కోసం ధర్మాడి టీమ్ పట్టు వదలకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిన్న చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ద్వారా కీలక పురోగతి సాధించిన ధర్మాడి బృందం… బోటును
రాయల్ వశిష్ట బోటు కోసం ధర్మాడి టీమ్ పట్టు వదలకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిన్న చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ద్వారా కీలక పురోగతి సాధించిన ధర్మాడి బృందం… బోటును వెలికితీసేందుకు మళ్లీ ప్రయత్నించబోతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఇవాళే బోటును వెలికి తీస్తామమని ధర్మాడి చెబుతుండటంతో… గల్లంతైన వారి కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
బుధవారం ఆపరేషన్‌లో ధర్మాడి బృందం పురోగతి సాధించింది. యాంకర్‌కు బలమైన వస్తువు తగిలింది. యాంకర్‌కి పెయింట్ అంటుకోవడంతో.. అది కచ్చితంగా బోటే అని సత్యం బృందం నిర్ధారణకు వచ్చింది. 120 అడుగుల లోతులో బోటు ఉందని అంచనా వేస్తున్న ధర్మాడి టీమ్.. బోటు చుట్టూ ఉచ్చు బిగించి రోప్‌లు, జేసీబీల సాయంతో దానిని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. చీకటి పడటంతో నిన్న నిలిచిపోయిన వెలికితీత పనులను ఇవాళ మరోసారి కొనసాగించబోతోంది.
ప్రొక్లెయినర్లు, భారీ యాంకర్లు, బలమైన రోపులతో బోటును బయటకు లాగనుంది ధర్మాడి టీమ్. అవసరమైతే.. విశాఖ నిపుణుల సాయం తీసుకుంటామన్నారు. నిపుణుల సలహాతో.. మనిషిని లోపలికి పంపించి.. బోటుకు తాళ్లు గానీ.. యాంకర్ గానీ తగిలిస్తామని చెప్పారు. అందుకోసం విశాఖకు చెందిన ముగ్గురు గజ ఈతగాళ్లతో ధర్మాడి మాట్లాడారు. వారు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధం చేసి ఉంచారు.
గతంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో యాంకర్ విరిగిపోవడం, రోప్ తెగిపోవడంతో…. ఈసారి వాటికంటే బలమైన సామాగ్రిని వాడుతున్నారు. బోటుకు ఉచ్చు వేయడానికి 1.25 అంగుళాల మందం, 1500 మీటర్ల పొడవైన ఇనుప రోప్‌ను ఉపయోగిస్తున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో.. బోటు బయటకు వస్తుందని ధర్మాడి సత్యం టీమ్ నమ్మకంగా ఉంది.