ఆడపిల్లలకు భద్రత ఏది? నూజివీడు ట్రిపుల్ ఐటీ అమ్మాయిల హాస్టల్ రూమ్‌లో అబ్బాయి

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ... 4వేల 500 మంది అమ్మాయిలు, 3వేల 500 మంది అబ్బాయిలకు విద్యనందిస్తున్న క్యాంపస్‌. నిత్యం సెక్యూరిటీ పహారాలో ఉంటుంది. అయినా

  • Publish Date - February 23, 2020 / 06:10 AM IST

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ… 4వేల 500 మంది అమ్మాయిలు, 3వేల 500 మంది అబ్బాయిలకు విద్యనందిస్తున్న క్యాంపస్‌. నిత్యం సెక్యూరిటీ పహారాలో ఉంటుంది. అయినా

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ(nuzvid iiit)… 4వేల 500 మంది అమ్మాయిలు, 3వేల 500 మంది అబ్బాయిలకు విద్యనందిస్తున్న క్యాంపస్‌. నిత్యం సెక్యూరిటీ పహారాలో ఉంటుంది. అయినా ఓ అబ్బాయి దర్జాగా లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించాడు. గంట కాదు.. రెండు గంటలు కాదు. ఏకంగా 24 గంటలు.. లేడీస్ హాస్టల్‌ రూమ్‌లోనే ఉన్నాడు. అయినా ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నా… ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. క్యాంపస్‌లోని సెక్యూరిటీ లోపాలను ఎత్తి చూపింది. అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేలా చేసింది.

అబ్బాయి గురించి అమ్మాయిలు ఎందుకు చెప్పలేదు:
నూజివీడులో ట్రిపుల్ ఐటీలో అసలేం జరుగుతోంది? ఇక్కడ చదువుకునే బాలికల భద్రత గాలిలో దీపంలా మారిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఒక పగలు.. ఒక రాత్రి.. లేడీస్‌ హాస్టల్‌లోని గదిలో జెంట్‌ ఉండగలిగాడంటే ఇక్కడి సెక్యూరిటీ ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. అయితే..ఇంత జరిగినా… తోటి విద్యార్థినులు కాలేజీ సిబ్బందికి ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? దాని వెనకున్న కారణాలేంటి? అసలు. హాస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, వార్డెన్ ఏం చేస్తున్నారు? ఇవే అంశాలు ఇపుడు చర్చనీయాంశమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.

ట్రిపుల్ ఐటీ ఆత్మహత్యలు:
ట్రిపుల్‌ ఐటీలో సీటంటే మాటలు కాదు. మెరిట్ విద్యార్థులు మాత్రమే ఇక్కడ సీటు సంపాదించుకోగలుగుతారు. ఇక్కడ చదివితే తమ పిల్లల భవిష్యత్ బంగారంలా ఉంటుందని తల్లిదండ్రులు కూడా నమ్ముతారు. అదే నమ్మకంతో తమ బిడ్డలను ఇక్కడికి పంపిస్తారు. కానీ… ఇక్కడి సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు…. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. విద్యార్థులను కంటికిరెప్పలా కాపాడాల్సిన సెక్యూరిటీ సిబ్బంది… భద్రతను మరిచి జీతాల కోసం పనిచేస్తుంటే.. స్టూడెంట్స్‌ను నిత్యం పర్యవేక్షించాల్సిన వైస్‌ ఛాన్స్‌లర్‌, ఛాన్స్‌లర్, డైరెక్టర్.. ఆ విషయమే మర్చిపోయారు. దీని పర్యవసానమే… ఎన్నో ఆశలతో ఇక్కడ అడుగుపెట్టిన విద్యార్థుల ఆత్మహత్యలు. ఉన్నత జీవితాలను ఊహించుకుంటూ ఇక్కడికి వచ్చిన విద్యార్థుల్లో కొందరు అర్ధాంతరంగా తనువు చాలించారు. బలవంతపు మరణాలకు పాల్పడ్డారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదేమిటని ఎవరినీ ప్రశ్నించ లేదు. దాని ఫలితమే… ప్రస్తుతం వెలుగుచూసిన విపరీత పరిణామం.

సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతున్నారా?
వంద ఎకరాల్లోని నూజివీడు ట్రిపుల్ ఐటీకి మొత్తం 300మంది సెక్యూరిటీ ఉంటారు. వీరిలో 200మంది మహిళా సిబ్బంది ఉన్నారు. వీరికి తోడు రాత్రి సమయంలో మరో 50 మంది పహారా కాస్తుంటారు. దీంతో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోవాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది. తమ బిడ్డలను కలిసేందుకు వచ్చే తల్లిదండ్రులను సవాలక్ష ప్రశ్నలు వేసే సెక్యూరిటీ సిబ్బంది… ఏకంగా ఓ విద్యార్థి… అమ్మాయిల హాస్టల్‌లోకి అడుగుపెడుతుంటే ఏం చేస్తున్నారన్న దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవమేంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

కిటీకీ ఓపెన్ చేసి అబ్బాయిని లోపలికి రప్చించిన విద్యార్థిని:
అయితే ఈ మొత్తం వ్యవహారంపై క్రమశిక్షణా కమిటీ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ లోపాలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఇష్యూపై మంత్రి స్పందించాక గానీ…. క్యాంపస్ అధికారులు కళ్లు తెరవలేదు. సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు వైస్ ఛాన్సలర్ హేమచంద్రారెడ్డి. పిల్లల భవిష్యత్ పాడవుతుందనే దీనిపై మౌనంగా ఉన్నట్లు చెప్పారు. హాస్టల్‌ గది లోపల ఉన్న విద్యార్థినే కిటికీ ఓపెన్ చేసినట్లు వెల్లడించారు.

ఆ అబ్బాయిని మందలించి పంపేశారు:
విద్యార్థిని సహకారంతోనే ఆ విద్యార్థి హాస్టల్‌లోకి వచ్చినట్లు చెబుతున్న అధికారులు… వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేడీస్‌ హాస్టల్లో రోజంతా గడిపిన అబ్బాయిపై చర్యలు లేకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. క్యాంపస్‌లో క్రమశిక్షణ లేదని కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎవరెవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారో వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

అబ్బాయిని మంచం కింద దాచిపెట్టిన అమ్మాయి:
నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉండే లేడీస్‌ హాస్టల్‌ గదిలోకి ఇంజనీరింగ్‌ విద్యార్థి ప్రవేశించి గంటలపాటు లోపలే ఉండటం సంచలనంగా మారింది. క్యాంపస్ లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకూ టెక్‌జెట్‌-20 కార్యక్రమం నిర్వహించారు. 16వ తేదీ అందరూ కార్యక్రమం ముగింపు హడావిడిలో ఉండగా.. అర్ధరాత్రి సమయంలో కె-3 బ్లాక్ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని విద్యార్థినుల గదిలోకి ఇంజనీరింగ్‌ ఫస్టియర్  విద్యార్థి ప్రవేశించాడు. ఆ రూమ్‌లో తన గర్ల్ ఫ్రెండ్ తో ఆ రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఈ విషయం ఆమెతో ఉండే తోటి విద్యార్థినులకు తెలిసినా బయటకు చెప్పలేదు. పైగా గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయి వారికి సహకరించారు. విషయం బయటకు పొక్కడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ రూమ్‌ తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లారు. లోపల ఉన్న అన్ని మంచాల కింద చూశారు. ఈ క్రమంలో ఓ మంచం కింద దాక్కున్న యువకుడిని చూసి కంగుతిన్నారు.