భక్తులకు బంపర్ ఆఫర్ : రూ.10వేలతో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం

తిరుమల వేంకటేశుడిని.. అందరి భక్తుల కంటే దగ్గరి నుంచి చూడాలని ఉందా? చాలా ఈజీగా.. వీఐపీలా.. బ్రేక్ దర్శనం చేసుకోవాలనుందా? ఐతే.. ఇందుకు ఎలాంటి రికమండేషన్లు

  • Publish Date - October 23, 2019 / 11:04 AM IST

తిరుమల వేంకటేశుడిని.. అందరి భక్తుల కంటే దగ్గరి నుంచి చూడాలని ఉందా? చాలా ఈజీగా.. వీఐపీలా.. బ్రేక్ దర్శనం చేసుకోవాలనుందా? ఐతే.. ఇందుకు ఎలాంటి రికమండేషన్లు

తిరుమల వేంకటేశుడిని.. అందరి భక్తుల కంటే దగ్గరి నుంచి చూడాలని ఉందా? చాలా ఈజీగా.. వీఐపీలా.. బ్రేక్ దర్శనం చేసుకోవాలనుందా? ఐతే.. ఇందుకు ఎలాంటి రికమండేషన్లు అవసరం లేదు. ఎలాంటి పైరవీలు చేయాల్సిన పనిలేదు. జస్ట్.. రూ.10వేలుంటే చాలు. చాలా ఈజీగా.. కలియుగ దైవాన్ని కనులారా దర్శించుకోవచ్చు. బ్రేక్ దర్శనాల కోసం.. టీటీడీ తెచ్చిన కొత్త విధానం.. భక్తులకు బంపర్ ఆఫర్‌లా మారింది. టీటీడీ శ్రీవాణి ట్రస్టుకు 10 వేలు విరాళమిస్తే చాలు.. ఒకరికి బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని.. కొందరు దళారులు గతంలో పెద్ద దందానే నడిపారు. ఎల్ వన్ బ్రేక్ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనానికి.. రికమండేషన్ లెటర్లు ఏర్పాటు చేసి అధిక ధరలకు బ్లాక్‌లో అమ్ముకున్నారు. అలా.. భక్తుల నుంచి భారీగా దండుకున్నారు. దీనిపై దృష్టి పెట్టిన టీటీడీ.. దళారులకు చెక్ పెట్టేందుకు.. అక్టోబర్ 21 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శ్రీవాణి(శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ) ట్రస్టుకు రూ.10 వేలు విరాళమిస్తే.. టీటీడీ సిబ్బందే స్వయంగా వీఐపీ బ్రేక్ దర్శనం చేయిస్తారు. ఇందుకోసం.. తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్‌లో.. ప్రత్యేక కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

కొత్తగా అమల్లోకి తెచ్చిన విధానం ద్వారా.. తొలి రోజు ఐదుగురు భక్తులు రూ.10 వేలు విరాళమిచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు. రెండో రోజుకు వచ్చేసరికి.. ఆ కౌంట్ 33కు పెరిగింది. ఈ విధానంపై పూర్తిస్థాయి సమాచారం లేకపోవడంతో.. ప్రస్తుతం భక్తుల తాకిడి తక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే.. బ్రేక్ దర్శనాలకు డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. ఐతే.. రోజుకు ఎన్ని టికెట్లు కేటాయిస్తారన్న దానిపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. రద్దీని బట్టి కోటాను నిర్ణయించే చాన్స్ ఉంది.

ఈ విధానంలో.. గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఇచ్చినట్లుగా ముందుగా జేఈవో ఆఫీసులో అప్లికేషన్ ఇవ్వాల్సిన పనిలేదు. రాత్రి 11 గంటల వరకు భక్తులు ఎప్పుడైనా వచ్చి.. గోకులం గెస్ట్ హౌస్‌లోని కౌంటర్ లో విరాళాన్ని ఇచ్చి టికెట్లు తీసుకోవచ్చు. రూ.10 వేలు విరాళమిచ్చిన భక్తులకు.. రూ.500 బ్రేక్ దర్శనం టికెట్టు కొనుక్కున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తారు. దీని ద్వారా.. మరుసటి రోజు ఉదయం ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం టైంలో.. భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ విధానంలో.. ముందుగా ప్రోటోకాల్ పరిధిలోని వారిని దర్శనానికి అనుమతిస్తారు. తర్వాత శ్రీవాణి ట్రస్టుకు విరాళాలిచ్చిన దాతలను.. అనుమతిస్తారు. ప్రోటోకాల్ పరిధిలోని వారి తరహాలోనే.. వీరికి కూడా స్వామివారి ముందు హారతి, తీర్థం, శఠారి ఇస్తారు.

సాధారణంగా శ్రీవాణి ట్రస్టుకు.. దాతలు ఎంతైనా విరాళాలు ఇవ్వొచ్చు. కనీసంగా.. రూ.10 వేలు ఇచ్చిన వారికి మాత్రం.. బ్రేక్ దర్శనం టికెట్లను జారీ చేస్తున్నారు. ఒకవేళ శ్రీవాణి ట్రస్టుకు.. లక్ష, 5 లక్షలు, 10 లక్షలు విరాళం ఇస్తే.. ఓసారి బ్రేక్ దర్శనం టికెట్లతో పాటు ఇతర ట్రస్టులకు విరాళమిచ్చిన దాతలకు కల్పించిన ప్రివిలేజెస్ అన్నీ కల్పిస్తారు. బ్రేక్ దర్శనాల కోసం టీటీడీ తీసుకొచ్చిన ఈ కొత్త విధానం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.