సీఎం జగన్‌కు వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ లేఖ

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 03:43 AM IST
సీఎం జగన్‌కు వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ లేఖ

Updated On : September 25, 2019 / 3:43 AM IST

వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. చంద్రబాబుకు అద్దెకు ఇచ్చిన ఇంటి దగ్గర సీఆర్‌డీఏ అధికారులు చేస్తున్న హడావుడి ఆందోళనకు గురిచేస్తోందన్నారు. 2014లో సీఎం నివాసానికి అనుకూలంగా ఉంటుందని అధికారులు కోరితే తన అతిథి గృహాన్ని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చేందుకు ఒప్పుకున్నానని చెప్పారు. తన నిర్ణయం వెనుక రాజకీయ, ఆర్ధిక ప్రతిపాదనలు లేవని లేఖలో తెలిపారు.

బాధ్యత గల పౌరుడిగా దీనికి అంగీకరించానని చెప్పారు. అప్పట్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా…ఎవరు సీఎంగా ఉన్నా…తను ఇలాగే స్పందించేవాడినని లేఖలో లింగమనేని రమేష్‌ వెల్లడించారు. అప్పటి సీఎంకు ఇంటిని అద్దెకు ఇచ్చినందున నేను ఆయనకు బినామీనని అవాస్తవాలు ప్రచురించి ఆవేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ నివాసానికి ఉండవల్లి పంచాయతీ, కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ ఏఈ, ఇరిగేషన్‌ అధికారుల నుంచి ఎన్‌వోసీ తీసుకున్నానని చెప్పారు. కరకట్ట వెంబడి మొదలైన కూల్చివేతలు తమ ప్రాంతానికి కూడా వస్తాయని అందరూ భయపడుతున్నారని తెలిపారు. తన ఆస్తులపై విచారణ జరపాలని మీరు ఆదేశించారు. కొత్తగా మీకు తెలియజేయాల్సింది..తాను దాచిపెట్టింది ఏమీలేదని లేఖలో రమేష్‌ వివరించారు.